పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి

13 Jan, 2023 18:46 IST|Sakshi
గిరిరావు (ఫైల్‌) 

సాక్షి, మదనపల్లె సిటీ: నీటి కుంటలో మునిగిపోతున్న పాపను కాపాడబోయి జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి, బీటీ కాలేజీ పూర్వపు ఫిజికల్‌ డైరెక్టర్‌ లెక్కల గోవర్థన గిరిరావు(53) గురువారం మృతి చెందాడు. దీంతో క్రీడాకారుల్లో విషాదం నెలకొంది. మదనపల్లె పట్టణం కృష్ణానగర్‌కు చెందిన గోవర్థన గిరిరావు జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శిగా ఉన్నారు. భార్య జలజ తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సెలవులు కావడంతో తనతో పాటు పాఠశాలలో పని చేసే హిందీ టీచర్‌ దీప, ఫిజికల్‌ సైన్సు టీచర్‌ ఇంద్రాణి కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లారు.

దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లె– చౌడేపల్లె మార్గంలోని ఓ ఫామ్‌హౌస్‌ వద్ద వంటలు చేసుకునేందుకు వెళ్లారు. వీరితో పాటు వెళ్లిన పిల్లలు సరదాగా ఫామ్‌ హౌస్‌లో ఆడుకుంటుండగా హిందీ టీచర్‌ కుమార్తె లాస్య ప్రమాదవశాత్తు నీటికుంటలో పడటంతో కేకలు వేసింది. గమనించిన గిరిరావు వెంటనే లాస్యను కాపాడేందుకు నీటికుంటలో దూకాడు. నీటి కుంట బురదమయమై ఉండటంతో ఇరుక్కుపోయాడు. ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

నీటి కుంటలో గిరిరావు ఇరుక్కపోవడాన్ని గమనించిన పిల్లలు కేకలు వేయడంతో, పరిసర ప్రాంతాలవారు అక్కడికి చేరుకుని ఆయన్ను వెలికితీశారు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, ప్రాథమిక చికిత్స చేసినప్పటికి గిరిరావు మృతి చెందాడు. కుటుంబసభ్యులు, భార్య జలజ, కుమారుడు జస్వంత్‌లు ఆయన మృతిని తట్టుకోలేక బోరున విలపించారు. శుక్రవారం కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఎమ్మెల్యే పరామర్శ
గిరిరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నవాజ్‌బాషా గిరిరావు ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి ,బీటీ కాలేజీ కరస్పాండెంట్‌ వై.ఎస్‌.మునిరత్నం, దివ్యభారతి ప్రసాద్‌రెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ కరస్పాడెంట్‌ రాటకొండ గురుప్రసాద్, సాయిశేఖర్‌రెడ్డి, పీడీలు భౌతికకాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు