అంతర్వేది రథం దగ్ధం కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం

7 Jan, 2023 08:17 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

కాకినాడ వినియోగదారుల ఫోరం తీర్పు 

కాకినాడ లీగల్‌: అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం ఇవ్వాలని కాకినాడ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పారు. ప్రమాదవశాత్తు రథం దగ్ధమైన కేసులో అంతర్వేది శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్‌ అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రూ.84 లక్షల పరిహారం, నష్టాల కింద రూ.15 లక్షలను యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లించాలని కోరారు.

రథం ఘటన ప్రమాదం కాదంటూ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ తరఫు న్యాయవాది వాదించారు. కాకినాడ కోర్టు పరధిలోకి ఈ కేసు రాదన్నారు. దీనిపై ఎండోమెంట్‌ ప్యానల్‌ న్యాయవాది జీవీ కృష్ణప్రకాష్‌ వాదిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్‌ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును కాకినాడ కోర్టులోనే విచారించాలన్నారు. వాదోప­వాదనల అనంతరం రూ.84 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేలు ఖర్చుల కింద 45 రోజుల్లోపు బీమా కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

హెచ్‌ఆర్‌సీకి 9 నుంచి సంక్రాంతి సెలవులు
కర్నూలు(సెంట్రల్‌): స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌(హెచ్‌ఆర్‌సీకి)కి ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్‌ కార్యదర్శి ఎస్‌.వెంకటరమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాత కేసుల వాయిదా, విచారణ, అత్యవసర కేసుల నిమిత్తం వెకేషన్‌ కోర్టులను నిర్వహిస్తారు. 9, 10, 11 తేదీల్లో కమిషన్‌ చైర్మన్‌ ఎం.సీతారామమూర్తి, 12, 13 తేదీల్లో కమిషన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వెకేషన్‌ కోర్టు నడుస్తుంది. 14, 15, 16 తేదీల్లో పూర్తి సెలవు ఉండగా.. 17వ తేదీన కమిషన్‌ నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడు జి.డాక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెకేషన్‌ కోర్టు ఉంటుంది. 18వ తేదీ నుంచి యధాతథంగా హెచ్‌ఆర్‌సీ కార్యకలాపాలు జరుగుతాయి.

ఇదీ చదవండి: TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! 

మరిన్ని వార్తలు