AOB: రేపటి నుంచి మావోయిస్టు  అమరవీరుల వారోత్సవాలు 

27 Jul, 2021 13:10 IST|Sakshi
నుర్మతి రోడ్డులో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీ

భగ్నం చేసే లక్ష్యంగా పోలీసుల జల్లెడ  

ఏజెన్సీలో రెడ్‌ అలెర్ట్‌  

పాడేరు/ముంచంగిపుట్టు: ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్‌ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాల పోలీసు బలగాలన్నీ ఇప్పటికే ఒడిశా కటాఫ్‌ ఏరియాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

విశాఖ ఏజెన్సీకి సంబంధించి కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని అన్ని పోలీసు స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్‌ అలెర్ట్‌ అమలు చేస్తున్నారు. ఏజెన్సీలోని దారకొండ, పెదవలస, బలపం, నుర్మతి, రూడకోట అవుట్‌పోస్టుల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ చర్యలు అధికమయ్యాయి.

మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. విశాఖ రూరల్‌ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డూడి, పాడేరు ఏఎస్పీ జగదీష్‌ ఈ రెండు సబ్‌ డివిజన్‌లలో పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూంబింగ్‌ చర్యలు, మండల కేంద్రాల్లోని వాహనాలు, ఇతర తనిఖీలను సమీక్షిస్తున్నారు.  

కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ముమ్మర తనిఖీలు చేస్తున్న బలగాలు
డాగ్, బాంబు స్క్వాడ్‌ల తనిఖీలు 
ముంచంగిపుట్టు మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దులో డాగ్, బాంబు స్క్వాడ్‌లతో పోలీసు బలగాలు కల్వర్టులు, వంతెనలు తనిఖీలు చేస్తూ వాహన రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. గూడెంకొత్తవీధి మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారపార్టీ నేతలపై దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్త చర్యలు చేపట్టారు.

జి.మాడుగుల మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్, సివిల్‌ పోలీస్, బాంబ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. చింతపల్లి–జీకే వీధి రహదారి మార్గంలో వాహనాలు తనిఖీ చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతగిరి మండలంలోని ములియగుడలోని జంక్షన్‌ వద్ద అరకు–విశాఖ ప్రధాన రహదారిలోని వాహనాలను ఆపి క్షుణంగా పరిశీలించారు.

మరిన్ని వార్తలు