AP: వైద్యుల సేవలు భేష్‌

7 Jan, 2022 07:48 IST|Sakshi
రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ హరిచందన్‌.. డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్‌ను అందజేస్తున్న దృశ్యం

సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. భవిష్యత్‌లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

సెకండ్‌ వేవ్‌ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్‌ సూచించారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు.

శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు.  

డాక్టర్‌ పళనివేలు, డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్‌లు.. 
కోయంబత్తూరులోని జెమ్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చైర్మన్‌ డాక్టర్‌ సి.పళనివేలు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్‌డీలు, ఒకరికి సూపర్‌ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు.

125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్‌మెడల్స్, రెండు సిల్వర్‌ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు.

కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.బాబ్జి, గుంటూరు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు