‘జోలదరాశి’కి జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఓకే

29 Jul, 2020 03:32 IST|Sakshi

రూ.207.95 కోట్ల వ్యయంతో టెండర్‌ నోటిఫికేషన్‌కు కసరత్తు 

జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించాక రాజోలి రిజర్వాయర్‌కు కూడా 

కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక

సాక్షి, అమరావతి: కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద కుందూ నదిపై 0.80 టీఎంసీల సామర్థ్యంతో రూ.207.95 కోట్ల వ్యయంతో రిజర్వాయర్‌ నిర్మాణ టెండర్‌ ప్రతిపాదనను జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోదించింది. ఈ పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. కుందూ నదిపై రెండు జలాశయాలను నిర్మించి, వరదను ఒడిసి పట్టి కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు డిసెంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

రెండు రిజర్వాయర్లు.. 
► జోలదరాశి వద్ద 0.80 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.312.3 కోట్లతో, చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.1,357.10 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. రాజోలి రిజర్వాయర్‌ టెండర్‌ ప్రతిపాదనలను జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన తరువాత నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 

కేసీ కెనాల్‌కు 140 ఏళ్ల చరిత్ర.. 
జల రవాణా కోసం తుంగభద్ర–పెన్నాను అనుసంధానం చేస్తూ కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్‌ సంస్థ ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా నది వరకు కాలువ తవ్వకం పనులను 1873లో ప్రారంభించి 1880 నాటికి పూర్తి చేసింది. డచ్‌ సంస్థ తవ్విన కేసీ కెనాల్‌ను 1880లో బ్రిటీష్‌ ప్రభుత్వం 3.02 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కాలువ 1933 నుంచి సాగునీటి ప్రాజెక్టుగా మారింది.

ఆయకట్టు రైతులకు భరోసా.. 
► బచావత్‌ ట్రిబ్యునల్‌ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. ఇందులో సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. అయితే సుంకేశుల బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలే కావడం, వర్షాభావంతో నీటి లభ్యత కనిష్ట స్థాయికి చేరడం వల్ల కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. 
► కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టడం ద్వారా కేసీ కెనాల్‌ ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్‌ 23న పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
► రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి, మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. అయితే ఆయన హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తరువాత కేసీ కెనాల్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాలను నిర్మించాలని నిర్ణయించారు.   

రూ.54.36 కోట్లతో వెంగళరాయసాగరం ఆధునీకరణ
విజయనగరం జిల్లాలోని వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా) నిధులతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని భావిస్తోంది. ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.54.36 కోట్ల వ్యయంతో ఈనెల 20న జలవనరులశాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆగస్టు 7న టెండర్‌ ఖరారు చేయనుంది.

► విజయనగరం జిల్లా సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నదిపై 1.68 టీఎంసీల సామర్థ్యంతో 1976లో వెంగళరాయసాగరం నిర్మించారు. ఎడమ కాలువ కింద 8,550 ఎకరాలు, కుడి కాలువ కింద 16,150 ఎకరాలు, కుడి గట్టు కాలువ కింద 5 వేల ఎకరాలు వెరసి 29,700 ఎకరాల ఆయకట్టు ఉంది.
► ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, స్పిల్‌ వేలో లోపాలు, గేట్లకు మరమ్మతు చేయకపోవడం, కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు.
► ఏపీఐఎల్‌ఐపీ రెండో దశలో వెంగళరాయసాగరం ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.54.36 కోట్లు కేటాయించారు. ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది.
► ప్రాజెక్టులో పూడిక తొలగించడం, స్పిల్‌ వే మరమ్మతులు, గేట్లు బిగించడం.. కాలువలకు లైనింగ్‌ చేయడం ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించనున్నారు.  

మరిన్ని వార్తలు