ప్రభుత్వ వాదనలు వినకుండానే..

15 Dec, 2020 03:25 IST|Sakshi
ఏజీ శ్రీరామ్‌

రీకాల్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

మీరు సుప్రీంకోర్టుకెళ్లినా అభ్యంతరం లేదు

రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపి తీరతాం

స్పష్టం చేసిన జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం

సుప్రీంకోర్టులో ఈ కేసు తేలిన తరువాతే కోర్టుకు సహకరిస్తానన్న ఏజీ

అందుకనుగుణంగా మధ్యాహ్నం విచారణకు హాజరుకాని ఏజీ

కేసులకు, విచారిస్తామంటున్న అంశాలకు పొంతనలేదు: సీనియర్‌ కౌన్సిల్‌

తదుపరి విచారణ రేపటికి వాయిదా

సాక్షి, అమరావతి: పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడం, తమ ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంపై.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా, లేదా అనేది తేలుస్తామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకోవాలని (రీకాల్‌) ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కనీసం వాదనలు కూడా వినకుండానే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, అప్పటివరకు విచారణ వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, విచారణను వాయిదావేసే ప్రసక్తేలేదని చెప్పింది. సోమవారం జరిగిన విచారణలో కనీసం అడ్వొకేట్‌ జనరల్‌ వాదనను వినిపించుకోకుండానే అనుబంధ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేస్తామని, రెండువారాలు వాయిదా వేయాలని అడిగినా పట్టించుకోకుండా బుధవారానికి వాయిదా వేసింది. ‘రాష్ట్రంలో పోలీసులు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, తరువాత వారిని కోర్టు ముందు హాజరుపరచడమో లేదా విడుదల చేయడమో చేస్తున్నారు. దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరాం. ఇలాంటివి పునరావృత్తం కావని డీజీపీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయినా పోలీసుల్లో పెద్ద మార్పేమీ రాలేదు. ఇదే సమయంలో హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శలు, దూషణల దాడులకు దిగారు. ఇందులో అధికార పార్ట ఎంపీ కూడా ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తాం’ అని న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఏజీగా కోర్టు నిష్పక్షపాతాన్ని కోరుకుంటున్నా..
అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినకుండానే ధర్మాసనం.. ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. తన వాదనలు వినాలని ఏజీ పలుమార్లు అభ్యర్థించినా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పట్టించుకోలేదు. తనకు వాదనలు చెప్పే అవకాశం, పలు న్యాయస్థానాల తీర్పులను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడం ఎంతమాత్రం సరికాదని శ్రీరామ్‌ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనలు వినలేదన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని ఏజీ కోరినా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేసిన అడ్వొకేట్‌ జనరల్‌.. తాను చెప్పిన వివరాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ద్వారా కోర్టు నిష్పక్షపాతాన్ని ఏజీగా తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఏజీ నుంచి ఇలాంటి వాదనను ఆశించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించగా, న్యాయస్థానం నుంచి తాము కూడా ఇలాంటి దానిని ఆశించడంలేదని ఏజీ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు తేలిన తరువాతే ఈ కేసులో కోర్టుకు సహకరిస్తానని తేల్చిచెప్పారు.

ఓ అడ్వొకేట్‌ జనరల్‌ ఇలా అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తంచేసే పరిస్థితిని న్యాయస్థానం కల్పించడం తెలుగు రాష్ట్రాల న్యాయవ్యవస్థ చరిత్రలో అరుదైన ఘటనగానే చెప్పాలి. ఇందుకనుగుణంగా మధ్యాహ్నం జరిగిన విచారణకు ఏజీ కాకుండా ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ హాజరయ్యారు. ఫలానా కారణాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న భావనతో కోర్టు విచారణ జరుపుతున్న పరిస్థితుల్లో, ఆ అంశాలపై కౌంటర్‌ దాఖలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని, అందువల్ల విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని సమన్‌ కోరారు. ఇందుకు సైతం నిరాకరించిన ధర్మాసనం ఏజీ ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ఏజీ తాను మధ్యాహ్నం విచారణకు రాబోనని ముందే చెప్పారని, అందుకే తాను వచ్చానని సుమన్‌ చెప్పారు. వాదనలు వినిపించేందుకు ఏజీ కాకుండా మీరెలా వస్తారని సుమన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తాను ఏజీకి అనుబంధ బృందంగా పనిచేస్తున్నానని, ఇదే ధర్మాసనం చాలా కేసుల్లో అడ్వొకేట్‌ జనరల్‌ తరఫున తాను హాజరయ్యేందుకు అనుమతినిచ్చి, వాదనలు కూడా విందని, ఇప్పుడు ఈ కేసులో మాత్రం అనుమతించబోమని చెప్పడం సరికాదని సుమన్‌ స్పష్టం చేశారు. అయినా ధర్మాసనం వినిపించుకోలేదు. సుమన్‌ వాదనలు వినిపిస్తుండగానే కోర్టువర్గాలు ఆయన మైక్‌ను మ్యూట్‌ (మాట వినిపించకుండా) చేసేశాయి.

పిటిషనర్లు కోరనిదానిపై విచారణకు వీల్లేదు..
రాజ్యాంగం వైఫల్యం చెందిందని చెప్పేందుకు హైకోర్టు చూపిన కారణాలపై పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక సీనియర్‌ కౌన్సిల్‌ ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజకీయ అనిశ్చితి, న్యాయ అరాచకం, శాసనవ్యవస్థ వైఫల్యం వంటివి ఉన్నప్పుడే రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఓ తీర్పులో చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేనప్పుడు రాజ్యాంగం వైఫల్యంపై సుమోటో (తనంతట తాను)గా విచారణ చేపట్టే పరిధి హైకోర్టుకు లేదని చెప్పారు. హైకోర్టు ముందు విచారణకు ఉన్న కేసులకు, హైకోర్టు విచారిస్తామంటున్న అంశాలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని కోర్టు తీర్పునిస్తే.. రాజ్యాంగం కల్పించిన రక్షణ కోర్టుకు ఉండదని, కోర్టుకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి వస్తుందని తెలిపారు.

రాజ్యాంగ వైఫల్యం చెందిందని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేస్తే దానికి ఎంత విలువ ఉంటుందో, కోర్టు తీర్పునకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని పిటిషనర్లు కోరలేదని, పిటిషనర్లు కోరని అంశంపై విచారణకు వీల్లేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ పలువురు వ్యక్తులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలో తాము చేస్తున్న నిరసనలకు పోటీగా ఇతరులెవ్వరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్‌ పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై కొద్దికాలంగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ రాకేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ ఆ దిశగా విచారణ మొదలుపెట్టింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు