కార్గో పార్శిళ్లపై నిఘా పెంచండి

4 Apr, 2023 08:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, గుట్కా, లిక్కర్, ఇతర చట్టవిరుద్దమైన వస్తువుల రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. కార్గో ద్వారా బుక్‌ చేసే పార్శిళ్లపై నిఘా పెంచాలని ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల, జోన్ల ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అనుమతి లేని లగేజ్‌ తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే చర్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిధిలోని అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు, పేలుడు పదార్థాలు, చట్టబద్ధంగా నిషేదించబడిన అన్నిరకాల వస్తువులను అనుమతించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కార్గోలో బుక్‌ చేసే ప్రతి పార్శిల్‌ను క్షుణంగా పరిశీలించాలని సూచించారు.

వినియోగదారుని ఆధార్, అడ్రస్, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ అంశాల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కేఎస్‌ బ్రహ్మనందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, ఓఎస్‌డీ రవివర్మ, సీటీఎం చంద్రశేఖర్, నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎం త్రినాథ్‌ పాల్గొన్నారు.

(చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ)

మరిన్ని వార్తలు