ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు

4 Apr, 2023 09:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్య­దర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హత­లతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది.

వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్య­ర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్‌–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్‌–1లో జన­రల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అను­వదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్య­మాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణ­నలోకి తీసుకోను­న్నారు. ఇక పేపర్‌–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు.

(చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్‌ అమ్మకం ధరలు తగ్గింపు!)

మరిన్ని వార్తలు