డిజిటల్‌ చెల్లింపులకు ఆర్టీసీ రైట్‌ రైట్‌ 

20 Mar, 2022 04:33 IST|Sakshi

బస్సుల్లో ఇ–పాస్‌ మెషిన్లతో టికెట్ల జారీ 

అన్నిరకాల సేవలకూ ఏకీకృత వ్యవస్థ 

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీ డిజిటల్‌ బాట పడుతోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి సదరు మొత్తాన్ని నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. ఇకపై డిజిటల్‌ చెల్లింపులను కూడా స్వీకరించేందుకు ఆర్టీసీ మార్గం సుగమం చేస్తోంది. దీనికోసం ‘యూనిఫైడ్‌ టికెటింగ్‌ సిస్టం (యూటీఎస్‌)’ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన టెండర్‌ను అభి బస్‌ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్‌ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా.. మూడు కంపెనీలు అర్హత సాధించాయి. రివర్స్‌ టెండరింగ్‌లో అభి బస్‌ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది. దేశంలోనే అతి తక్కువ రేటుకు కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.  

యూటీఎస్‌ విధానమిలా.. 
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీ కోసం వినియోగిస్తున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌ (టిమ్స్‌) స్థానంలో ఇ–పాస్‌ మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు. డెబిట్‌ కార్డ్, క్రెడిట్‌ కార్డ్, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్‌లు, బస్‌పాస్‌లు, కొరియర్‌ సేవలు, పార్సిల్‌ బుకింగ్‌లకూ అవకాశం కల్పిస్తారు. బస్‌ లైవ్‌ ట్రాకింగ్‌ తెలుసుకునే అవకాశంతోపాటు ప్రయాణికుల సమాచారం, సెంట్రల్‌ కమాండ్‌ స్టేషన్‌ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా అన్ని సేవలను ఏకీకృతం చేసి ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ యూటీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వచ్చే రెండు నెలల్లో దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తారు. ఆరేడు నెలల్లో రాష్ట్రమంతటా యూటీఎస్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు.   

మరిన్ని వార్తలు