ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు.. రూట్‌ మ్యాప్‌ రెడీ

6 Dec, 2022 08:56 IST|Sakshi

రూ.19,200 కోట్లతో 342 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం 

భూ సేకరణ దాదాపు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

10 ప్యాకేజీలుగా టెండర్ల ప్రక్రియ చేపట్టిన ఎన్‌హెచ్‌ఏఐ 

4 ప్యాకేజీలకు టెండర్ల ప్రకటన 

రాయలసీమ మీదుగా బెంగళూరుతో విజయవాడకు అనుసంధానం 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం 

2025కు రహదారి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం 

ప్రస్తుతం.. : కర్ణాటక రాజధాని బెంగళూరు – విజయవాడ మధ్య రోడ్డు మార్గం దూరం 560 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు. అదీ నేరుగా లేదు. వ్యయప్రయాసలతో కూడుకొన్నది. విజయవాడ నుంచి రాయలసీమకు వెళ్లడానికీ సరైన దారి లేదు. 

మూడేళ్ల తర్వాత : బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు మార్గం దూరం 342 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 6 గంటలే. పైగా, విజయవాడ నుంచి రాయలసీమలోని అనేక ప్రాంతాలకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గం. ప్రయాణ సమయం, ఖర్చు కూడా తక్కువ.

సాక్షి, అమరావతి: భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేతో ఈ కల సాకారమవుతుంది. రూ.19,200 కోట్లతో ఆరు లేన్లుగా 342 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్‌  హైవే నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ హైవేకి భూసేకరణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసింది. దాంతో 10 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి, పనులు అప్పగించే చర్యలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వేగవంతం చేసింది. నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలిచింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం.  

ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి విజయవాడతో నేరుగా రహదారి లేదు. కర్ణాటకకు కూడా అనుసంధానం సరిగా లేదు. ఈ రెండు ప్రయోజనాలను సాధించాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. సీఎం జగన్‌ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదించారు. ప్రస్తుతం బెంగళూరు – విజయవాడ మధ్య దూరభారాన్ని దాదాపు సగానికి తగ్గించేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఆరు గంటల్లోనే బెంగళూరు చేరుకోవచ్చు. సరుకు రవాణా కూడా మరింతగా పెరుగుతుంది. 

ఇదీ రూట్‌..
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు నుంచి ఈ హైవే ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో పుట్టపర్తి జిల్లాలోని కందికొండ, వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల, నెల్లూరు జిల్లా మల్లెపల్లి, వంగపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి మీదుగా మేదరమెట్ల వరకు వస్తుంది. అక్కడ జాతీయ రహదారి–16కు అనుసంధానిస్తారు. ఇది నేరుగా విజయవాడను కలుపుతుంది.

మరిన్ని వార్తలు