తెన్నేటి పార్కులో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్‌

6 Dec, 2021 14:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సిటీ ఆఫ్‌ డెస్టినీ సాగర తీరంలో మరో సరికొత్త ప్రాజెక్ట్‌ సందర్శకులకు ఆహ్వానం పలకనుంది. విశాఖ నగర ప్రజలతో పాటు దేశ విదేశీ పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సరకు రవాణా కోసం వచ్చి అలల తాకిడికి ఒడ్డుకొచ్చిన బంగ్లాదేశ్‌ నౌకను నీటిపై తేలియాడే రెస్టారెంట్‌ గా మార్పు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో నాలుగు నెలల్లో నౌకను ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా అభివృద్ధి చేసి..పర్యాటకులకు అందించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా బలమైన గాలుల ధాటికి 2020 అక్టోబర్‌ 12 అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ–మా షిప్‌ బోల్తా పడకుండా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకువచ్చింది.

ఆ సమయంలో నౌకలో కెప్టెన్‌ సహా 15 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, భారత తీరగస్తీ దళం(కోస్ట్‌ గార్డ్‌), మినిస్ట్రీ ఆఫ్‌ షిప్పింగ్, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్, మర్చెంటైల్‌ మెరైన్‌ డిపార్ట్‌మెంట్‌(ఎంఎండీ), ఇండియన్‌ నేవీ, హిందూస్థాన్‌ షిప్‌ యార్డ్‌ ఇలా.. మొత్తం ఎనిమిది సంస్థలు షిప్‌ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది.

ఈ తరుణంలో ఈ కార్గో షిప్‌ను ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారీటైమ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నౌకను వారం రోజుల పాటు పరిశీలించి.. టూరిజం శాఖకు నివేదిక ఇచ్చింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ కార్గో నౌకను ప్లాటింగ్‌ రెస్టారెంట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు కొన్ని నెలల కిందట కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. రూ.4.50 కోట్లకు విక్రయించేందుకు యాజమాన్యం పీఎన్‌ఐ క్లబ్‌ సిద్ధమవగా.. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రూ.1.25 కోట్లకు పర్యాటక శాఖ సొంత నిధులతో కొనుగోలు చేసింది.  

ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ప్రత్యేకతలివే..  
నౌకను అరుదైన ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ప్రపంచదేశాల పర్యాటకులను ఇట్టే ఆకర్షించేలా.. టూరిస్ట్‌ ఎమినిటీస్‌తో కూడిన ప్రాజెక్ట్‌గా డిజైన్‌ చేశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర శుభ కార్యాలు నిర్వహించేందుకు అనుగుణంగా బాంక్వెట్‌ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశీ రుచులు అందుబాటులో ఉండేలా 500 మందికి సరిపడా మల్టీ క్యూసిన్‌ రెస్టారెంట్‌ రానుంది.

ఒక సందర్శకుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో రూ.10.50కోట్లతో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను మిస్టర్‌ గిల్‌ మెరైన్స్‌ సంస్థతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. తెన్నేటి పార్కుతో కలిపి దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. ఆ పార్కును కూడా తమకు అప్పగించాలని జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులకు పర్యాటక శాఖ లేఖలు రాసింది. 

అంతర్జాతీయంగా ఆకర్షిస్తుంది  
విశాఖ తీరంలో ఐఎన్‌ఎస్‌ కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. త్వరలోనే సీ హారియర్‌ మ్యూజియం కూడా అందుబాటులోకి రానుంది. ఈ మూడింటితో పాటు ఎంవీ మా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి వస్తే.. ప్రపంచ పర్యాటక పటంలో ఈ తరహా మ్యూజియంలు, రెస్టారెంట్లు ఉన్న నగరంగా విశాఖపట్నం వినుతికెక్కనుంది.

గిల్‌ సంస్థ డీపీఆర్‌ తయారు చేస్తోంది. నాలుగు నెలల్లో షిప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. రెస్టారెంట్, ఏసీ గదులు, రూఫ్‌టాప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 29 నుంచి నౌక సందర్శించేందుకు పర్యాటకులను అనుమతినిస్తున్నాం. 
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు