Operation Parivartan: గంజాయి కట్టడికి దేశంలోనే భారీ ఆపరేషన్‌

29 Nov, 2021 12:08 IST|Sakshi
ఆంధ్ర– ఒడిశా సరిహద్దుల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న దృశ్యం

గంజాయిపై డ్రోన్లతో గురి

మన్యంలో అప్రతిహతంగా ఆపరేషన్‌ పరివర్తన్‌

నెల రోజుల్లో 5,600 ఎకరాల్లో తోటలు ధ్వంసం

గంజాయి కట్టడికి దేశంలోనే భారీ ఆపరేషన్‌

సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) వేళ్లూనుకున్న గంజాయి దందాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ అప్రతిహతంగా సాగుతోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్‌తో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రచారం చేపట్టినా గిరిజనుల సహకారంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) మన్యంలో ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా 10 మంది సభ్యులతో 30 బృందాలను ప్రభుత్వం నియమించింది.

చదవండి: విశాఖ నగరంపై స్టార్టప్‌ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు

మావోయిస్టుల బెదిరింపులు బేఖాతర్‌ 
మావోయిస్టుల సహకారంతోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డ్రోన్‌ కెమెరాల సహకారంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తోంది. గిరిజనులను భయపెట్టేందుకు మావోయిస్టులు ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోస్టర్లు అతికించారు. ‘పోలీసు వాహనాల్లో ప్రయాణించవద్దు.. గంజాయి మొక్కల నరికివేతకు సహకరించవద్దు.. ప్రత్యామ్నాయం చూపకుండా గంజాయి సాగును నిర్మూలించడం హేయమైన చర్య’ అని పేర్కొంటూ విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ పేరుతో పోస్టర్లు అతికించారు. అయితే ‘సెబ్‌’ బృందాలు ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. గిరిజనులు కూడా పూర్తిస్థాయిలో దీనికి సహకరిస్తున్నారు.

మన్యంలోకి ప్రత్యేక బృందాలు
పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తరువాతే ‘సెబ్‌’ ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టింది. తొలుత ప్రత్యేక నిఘా బృందాల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక సేకరించింది. అనంతరం డ్రోన్‌ కెమెరాలతో ఆ ప్రాంతాలను గుర్తించి రంగంలోకి దిగింది. మూడు బేస్‌ క్యాంప్‌ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక బృందాలు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుని ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. నిత్యం సగటున ఆరేడు గంటలపాటు ఆపరేషన్‌ నిర్వహిస్తూ సగటున 150 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. 

అతిపెద్ద ఆపరేషన్‌
అక్టోబరు 30న ప్రారంభించిన ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5,600 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం విశేషం. దీంతో పాటు అక్రమంగా రవాణా చేస్తున్న 18,600  కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 113 వాహనాలను జప్తు చేసి, 217 కేసులు నమోదు చేశారు. దాదాపు 2.15 కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీటి విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు నిర్మూలనకు  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ దేశంలో అతి పెద్దది.

29 రోజుల్లోనే పెద్ద ఎత్తున గంజాయిని ధ్వంసం చేయడంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏవోబీతోపాటు దండకారణ్యం విస్తరించిన ఒడిశా, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సాగవుతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృతస్థాయిలో ఆపరేషన్‌ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్‌ పరివర్తన్‌పై ఎన్‌సీబీ ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది.  

మరిన్ని వార్తలు