మోదీ ‘బర్త్‌ డే పార్శిల్‌’.. ప్రధానికి విషెస్‌ తెలిపేందుకు ప్రత్యేక పోస్టల్‌ కార్డు!

16 Sep, 2022 08:50 IST|Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు తపాల శాఖ ‘బర్త్‌ డే పార్శిల్‌’ పేరుతో ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు పోస్టల్‌ శాఖ విజయవాడ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ మల్లాది హరిప్రసాద్‌ చెప్పారు. 

విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి లేదా పోస్ట్‌మేన్‌ను కలిసి రూ.50 చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశం అక్టోబర్‌ రెండో తేదీ వరకు ఉంటుందన్నారు. 

ఈ నెల 23వ తేదీన విజయవాడలో సుకన్య సమృద్ధి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు హరిప్రసాద్‌ చెప్పారు. పదేళ్లలోపు బాలికలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచి ఈ పథకంలో డబ్బు పొదుపు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో పోస్టల్‌ అధికారులు శోంఠి రవికిషోర్, జి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు