ప్రధాని చొరవతోనే పైక్‌ తిరుగుబాటుకు జాతీయ గుర్తింపు 

5 Sep, 2021 03:37 IST|Sakshi

ఫిక్కీ భువనేశ్వర్‌ శాఖ వెబినార్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, అమరావతి: ఒడిశాలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పైక్‌ తిరుగుబాటుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే జాతీయ గుర్తింపు వచ్చిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఫిక్కీ భువనేశ్వర్‌ శాఖ శనివారం నిర్వహించిన వెబినార్‌లో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా బుక్సీ జగబంధు నేతృత్వంలో పైక్‌ తిరుగుబాటుకు దారితీసిన కారణాలను వివరించారు. 1997లో ఒడిశాలో తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశానని చెప్పారు.

ఎనిమిదేళ్లపాటు కొనసాగిన పైక్‌ తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర యుద్ధంగా గుర్తించడానికి చొరవ తీసుకున్నానని తెలిపారు. గజపతి మహారాజుకు కమాండర్‌–ఇన్‌–చీఫ్‌ అయిన బుక్సీ జగబంధు బ్రిటిష్‌ పాలకుల అణచివేత చర్యలను సహించలేకపోయారని వివరించారు. దీంతో ఆ రాష్ట్రంలోని పైకా అధిపతులందరినీ ఒకచోట చేర్చి ప్రజావిప్లవాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇలా 1817, మార్చి 29న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఒడిశాలో సాధారణ ప్రజలు చేసిన పోరు మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి దారితీసిందని వివరించారు. వెబినార్‌లో మాజీ ఎంపీ డాక్టర్‌ దిలీప్‌ టిర్కీ ప్రారంభోపన్యాసం చేశారు. భువనేశ్వర్‌ ఫిక్కీ (ఎఫ్‌ఎల్‌వో) చైర్‌పర్సన్‌ సునీతా మొహంతి, వైస్‌ చైర్‌పర్సన్‌ నమృత చాహల్, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్పీ సిసోడియా, వెబినార్‌లో పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు