విశాఖ ఉక్కులో పేలుడు

12 Feb, 2023 03:17 IST|Sakshi

9 మందికి తీవ్ర గాయాలు

ముగ్గురి పరిస్థితి విషమం

నీటిలో ఒక్కసారిగా స్లాగ్‌ పడటంతో సంభవించిన పేలుడు

ఉక్కు నగరం/గాజువాక: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శనివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇనుము ఉత్పత్తిలో భాగంగా స్లాగ్‌ పాట్‌ వెళ్లే ట్రాక్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. వాటిని తొలగిస్తుండగా దాని కిందనున్న నీటిలో వేడిగా ఉన్న స్లాగ్‌ (ఖనిజం నుంచి లోహాన్ని వేరు చేయగా మిగిలిన ద్రవం) పడింది. దీంతో  పేలుడు సంభవించింది.

ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ మేనేజర్‌ జె.జయకుమార్‌ (34), టెక్నీషియన్లు బి.ఈశ్వర్‌ నాయక్‌ (36), పండా సాహు (36), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ థాయ్‌వాలా (55), కాంట్రాక్ట్‌ కార్మికులు ఎస్‌.పోతయ్య (44), కె.శ్రీను (34), ఆర్‌.బంగారయ్య (34), ఆర్‌.సూరిబాబు (36), సీహెచ్‌.అప్పలరాజు (37) గాయపడ్డారు. శ్రీనుకు 90 శాతం, పోతయ్యకు 65  శాతం, డీజీఎం థాయ్‌వాలాకు 45 శాతం గాయాలైనట్టు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ప్రమాదంలో గాయపడిన 9 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగం సిబ్బంది క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్లాంట్‌ ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. డీసీపీ–2 ఆనంద్‌రెడ్డి, సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్‌ ప్లాంట్‌ సీఐ వి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌ భట్, డైరెక్టర్‌ (కమర్షియల్‌) డీకే మహంతి తదితర ఉన్నతాధికా­రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనతో ఉద్యోగ సంఘాల నాయకులు విస్మయానికి గురయ్యారు. ఉద్యోగులు పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. కాగా, పేలుడు ధాటికి విభాగంలోని ఉత్పత్తి కొంతసేపు నిలిచిపోయింది. ప్రమాదం వల్ల మెషినరీ చాలావరకు దగ్ధమైంది. ఎలక్ట్రికల్‌ వస్తువులు కూడా కాలిపోయాయి. ఉన్నతాధికారులు యుద్ధప్రాతి­పదికన చర్యలు చేపట్టి ఉత్పత్తిని పునఃప్రారంభించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు పరామర్శించారు.

మరిన్ని వార్తలు