గోనె సంచుల సమస్యకు చెక్‌ 

10 Sep, 2023 06:35 IST|Sakshi

మిల్లర్లే గోనె సంచులను సరఫరా చేసేలా ఉత్తర్వులు 

సహకరించని మిల్లర్లు సీఎంఆర్‌ ప్యానల్‌ నుంచి తొలగింపు 

ప్రస్తుత ఖరీఫ్‌లో 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్‌ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్‌ మిల్లింగ్‌ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. 

వినియోగ చార్జీలు చెల్లింపు 
కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సబ్‌ కలెక్టర్‌/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్‌ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్‌లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు.   
 

మరిన్ని వార్తలు