ఆత్మన్యూనత నుంచి ఆత్మగౌరవానికి బీసీలు

23 Nov, 2022 05:36 IST|Sakshi

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 

భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆత్మన్యూనతలో ఉన్న బీసీలను ఆత్మగౌరవంతో బతికేలా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజికవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యావకాశాలు లేక వెనుకబడిన బీసీలకు జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ డీబీటీ ద్వారా నవరత్నాలను అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ దోహదడుతుందన్నారు.

ఎమ్మెల్సీ టి.కల్పలత రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ అమరావతి అంటూ హడావుడి చేసే చంద్రబాబు అక్కడ లోకేశ్‌ను గెలిపించుకోలేకపోయారని, ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని హితవు పలికారు.

సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ వీసీ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జునరావు, నవరత్నాల అమలు కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి, 56 బీసీ కార్పొరేషన్ల సమన్వయకర్త ఎ.ప్రవీణ్, పర్సన్‌ ఇన్‌చార్జిలు కె.మల్లికార్జున, ఎ.కృష్ణమోహన్, డి.చంద్రశేఖరరాజు, పి.మాధవి లత, ఎస్‌.తనూజ, జి.ఉమాదేవి, ఎం.చినబాబు, భీమ్‌శంకర్, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు