అపోహలొద్దు.. ఆదుకుంటాం

9 Dec, 2023 06:18 IST|Sakshi

సంక్రాంతి లోపు రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ: సీఎం జగన్‌ 

80 శాతం సబ్సిడీతో వెంటనే శనగ విత్తనాలు 

జూన్‌ నాటికి రైతు భరోసాతోపాటు ఇన్సూరెన్స్ చెల్లిస్తాం 

ఈ నష్టం అపారం.. వేగంగా పారదర్శకంగా సాయం అందిస్తాం

బాపట్ల జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి    

సాక్షి ప్రతినిధి, గుంటూరు: తుపాన్‌తో పంటలు నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేలోగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు వెంటనే అందిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న మిరప, వరి పంటలను పరిశీలించిన అనంతరం బాధిత రైతులను సీఎం జగన్‌ ఊరడించారు.

ఎన్నడూ లేనంతగా నాలుగు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం జగన్ అన్నారు. ఇంత బాధాకరమైన పరిస్థితులు వచ్చినా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న నమ్మకం ఇక్కడి రైతన్నల్లో కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ ప్రభుత్వంలో అందరికి మంచే జరుగుతుందని కచ్చితంగా చెబుతున్నానన్నారు.  

నాలుగు రోజుల్లో.. 
'ఏ రాష్ట్రాలలోనూ లేనిది, మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థలుగా అవి నిలిచాయి. వివక్షకు తావులేకుండా, ఆఖరికి మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం అందరికి తోడుగా నిలుస్తోంది. జరిగిన నష్టాన్ని పారదర్శకంగా గుర్తించి, జాబితాను సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరి­చేసుకుని మరీ సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మనదే. గతంలో కరువులు, వరదలు వచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఏ రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందో, అసలు ఎంతమందికి వస్తుందో కూడా తెలియని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మారింది. వరదతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ రేషన్‌తో పాటు ప్రతి ఇంటికి రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. దాదాపు 12 వేల మందికి వారికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలతోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ వలంటీర్‌ వచ్చి అందచేస్తారు. 4 రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీని పూర్తి చేస్తాం.' అని సీఎం జగన్ తెలిపారు.

ఇన్సూరెన్స్‌పై ‘ఈనాడు’ దిక్కుమాలిన రాతలు 
మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! అదేపనిగా అబద్ధాలనే చూపించే, ప్రచురించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడులో ఇన్సూరెన్స్‌ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నష్టం జరిగితే.. మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేలోపే ఇన్సూరెన్స్‌  ఇచ్చింది ఈ ప్రభుత్వంలోనే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. జూన్‌ నాటికి రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ డబ్బులు ఇస్తాం. గతంలో ఇన్సూరెన్స్‌ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేసి ఏ ఒక్క రైతు మిస్‌ కాకుండా వారు కట్టాల్సిన ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ అన్నదాతలకు ఇన్సూరెన్స్‌ ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలో మాత్రమే. గతంలో చంద్రబాబు పాలనలో వరుసగా కరువు కాటకాలే తాండవించినా ఐదేళ్లలో 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్‌ కింద ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎక్కడా కరువు కాటకాలు లేకపోయినా నాలుగేళ్లలో 55 లక్షల మందికి రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్‌ డబ్బులు అందచేశాం. ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే వచ్చే ఖరీఫ్‌ నాటికి ఇన్సూ్యరెన్స్‌ కచ్చితంగా వస్తోంది. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌ ముగిసేలోగానే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్నది మన ప్రభుత్వమే. 

పారదర్శకంగా పంట నష్టం వివరాలు 
తుపాను విపత్తు వేళ కలెక్టర్లు అందరూ వెంటనే స్పందించి ఎన్యుమరేషన్‌ మొదలు పెడుతున్నారు. ఎన్యూమరేషన్‌ పూర్తైన తర్వాత 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో జాబితాను పారదర్శకంగా ప్రదర్శిస్తారు. ఈ జాబితాలో ఎవరైనా రైతు మిస్‌ అయితే, వారి పేరు మళ్లీ చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే సంక్రాంతిలోపు అర్హులు అందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చేస్తుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా గత నాలుగేళ్లుగా ఏటా ఇలానే అమలు చేస్తున్నాం.  

డబ్బులిచ్చి.. తగినంత సమయం 
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా.. సీఎం హోదాలో నేను వచ్చి జరుగుతున్న పనులను చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకుని, ఫొటోలకు పోజులిస్తూ టీవీల్లో, పేపర్లలో రావాలని తాపత్రయపడే వ్యక్తిని కాదు. గతానికి, ఇప్పటికి తేడా అదే. ఏదైనా సంఘటన జరిగితే మీ బిడ్డ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడు. ముందుగా కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్‌ చేస్తున్నాడు. వారికి సరిపడా వారం రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత బాగా జరిగిందా లేదా? అనేది నిర్ధారించుకునేందుకు స్వయంగా వచ్చి ప్రజలనే నేరుగా అడుగుతున్నాడు. మా కలెక్టర్‌ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడనే మాట ప్రజల నుంచి రావాలని అధికారులకు చెప్పా. గతంలో చంద్రబాబు కలెక్టర్లకు నిధులు ఇచ్చేవారు కాదు. అసలు ‘టీఆర్‌ 27’ అనే పదానికి అర్థమే ఆయనకు తెలియదు. కలెక్టర్లు, తహసీల్దార్లు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ విపత్తు సమయంలో పరుగులు తీస్తూ ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోంది. ఇప్పుడు జరిగిన నష్టం అపారం. చేయాల్సిన సాయం అంతా పారదర్శకంగా, వేగంగా జరుగుతోంది. గత ప్రభుత్వాల కంటే కచ్చితంగా ఎక్కువే జరుగుతుందని గుర్తుంచుకోవాలి.   

పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు 
కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్థనరెడ్డి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, కరణం బలరాం, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.   

ఇదీ చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం

>
మరిన్ని వార్తలు