మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు

24 Jul, 2020 06:36 IST|Sakshi
యల్లపువారివీధి రోడ్డుపై వృద్ధుని శవం 

కుప్పకూలిన కరోనా రోగి 

నడిరోడ్డుపై నాలుగు గంటల పాటు శవం

సామాజికవేత్త యల్లపు చొరవతో అంత్యక్రియలు

అల్లిపురం (విశాఖ దక్షిణం): ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’.. అన్నాడు కవి అందెశ్రీ. కరోనా సోకి కుప్పకూలిన ఓ వృద్ధుడి శవాన్ని నడిరోడ్డుపై నాలుగ్గంటల పాటు ఎవరూ పట్టించుకోని అమానవీయ సంఘటన ఈ గీతాన్ని గుర్తుకు తెస్తోంది. అల్లిపురంలో యల్లపువారి వీధికి చెందిన వృద్ధునికి (75) కరోనా పాజిటివ్‌ అని బుధవారం నిర్థారణయింది. ఆయనను క్వారంటైన్‌కు తీసుకెళ్లేందుకు గురువారం సాయంత్రం 3.30 గంటలకు అంబులెన్స్‌ నేరెళ్ళకోనేరు జంక్షన్‌కు చేరుకుంది.

అంబులెన్స్‌ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న వృద్ధుడు నడిచే శక్తిలేక దారిలో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో చుట్టుపక్కల వారు ఎవరూ అతని దగ్గరకు చేరలేదు. మృతునికి కుమార్తె, కోడలు, మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వృద్ధుడు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. మృతదేహం నాలుగు గంటల పాటు నడిరోడ్డుపైనే ఉన్నా ఎవరూ స్పందించలేదు. ఎట్టకేలకు రాత్రి 7.30 గంటల సమయంలో స్థానిక సామాజికవేత్త యల్లపు శ్రీనివాసరావు చొరవతో కేజీహెచ్‌ నుంచి మహాప్రస్థానం అంబులెన్స్‌ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు. 

మరిన్ని వార్తలు