చిన్నారుల చదువుపై కోవిడ్‌ దెబ్బ.. నీతి ఆయోగ్‌ అధ్యయనం

6 Jun, 2022 05:06 IST|Sakshi

దేశంలో 3–6 ఏళ్ల పిల్లల్లో 42 శాతం మందికే అందిన దూర విద్య 

కరోనాకు ముందు ఏపీలో 84 శాతం మంది చిన్నారులు స్కూళ్లలో చేరిక

కానీ, కోవిడ్‌ వేళ రాష్ట్రంలో కేవలం 29 శాతం మందికి అందిన దూర విద్య 

కోవిడ్‌ కష్టకాలంలో పిల్లల చదువులు, ఆరోగ్యంపై నీతి ఆయోగ్‌ నివేదిక

సాక్షి, అమరావతి: దేశంలోని మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులపై కోవిడ్‌ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.  ప్రధానంగా లాక్‌డౌన్‌ సమయంలో ఈ వయస్సులోని పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో ఏర్పడిన అంతరాయాలపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేసింది. ఆ సమయంలో దేశంలోని అన్ని పాఠశాలలు, ప్రీస్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. చిన్న పిల్లల వ్యక్తిగత విద్యను పూర్తిగా నిలిపేయడంతో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల ప్రారంభ అభ్యాసానికి తీవ్ర అంతరాయం కలిగిందని అందులో తేలింది. ఈ వివరాలను డిసెంబర్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య సేకరించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

అందుబాటులోలేని దూరవిద్య
ఇక కోవిడ్‌ సంక్షోభ సమయంలో పిల్లలు చదువుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదిపాటు దూరవిద్య అందించేందుకు చర్యలను చేపట్టాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు, టీవీ, రేడియో ద్వారా ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే.. దేశంలోని చాలా కుటుంబాలకు ఈ దూరవిద్య అందలేలేని అధ్యయనం పేర్కొంది. 42 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే కొంతమేర అభ్యసించే అవకాశం కలిగిందని, మిగతా కుటుంబాల పిల్లలకు లేదని తెలిపింది. ఉదా.. కోవిడ్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 84 శాతం మంది స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరారని.. అయితే సంక్షోభ సమయంలో ఏపీలో కేవలం 29 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే దూరవిద్య అందిందని ఆ నివేదిక తెలిపింది.

అలాగే, రాజస్థాన్‌లో 23 శాతం మంది, తమిళనాడులో 17 శాతం మంది కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అయితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య దూరవిద్య సౌకర్యంలో అంతరాలున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో దూర విద్య ఎక్కువ శాతం పిల్లలకు అందుబాటులో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

వీడియోల వైపు పిల్లల మొగ్గు
2020 మార్చి కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు వీడియోలు చూడటానికి అలవాటుపడ్డారని.. టీవీ, ఫోన్‌ల వినియోగంతోపాటు కంప్యూటర్‌లో గేమ్‌లూ ఆడారని 41 శాతం పట్టణ తల్లిదండ్రులు తెలిపారు. కోవిడ్‌ కష్టకాలంలో ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొన్నట్లు 90 శాతం మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చెప్పారు. తమిళనాడులో 66 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 64 శాతం, ఒడిశాలో 60 శాతం మంది 2021 జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఒత్తిడికి లోనైనట్లు వారు వెల్లడించారు.  

పిల్లల వైద్యంపై కూడా.. 
మరోవైపు.. లాక్‌డౌన్‌ కారణంగా 2020 మార్చి–మే నెలల మధ్య తల్లి, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సేవలు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో కాన్పులు 21 శాతం తగ్గిపోగా ఆ స్థానంలో ఇంటివద్దే జరిగాయని.. అంతేకాక, ఆ సమయంలో గర్భిణీల ఆరోగ్య పరీక్షలూ నిలిచిపోయాయని నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది.

ఇక కోవిడ్‌ తొలినాళ్లలో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంలో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ 86 శాతం పిల్లలకు వేశారు. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 85 కుటుంబాల్లోని పిల్లలకు ఇవి అందినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం, పట్టణ ప్రాంతాల్లో 93 శాతం కుటుంబాలు కోవిడ్‌ సమయంలో తమ పిల్లలకు ఇతర వైద్య సదుపాయాలు అందాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు