‘సర్దుబాటు’ పాపం గత సర్కారుదే

1 Sep, 2021 02:31 IST|Sakshi

టీడీపీ హయాంలో రెట్టింపైన పంపిణీ సంస్థల అప్పులు

ఐదేళ్లలో రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లు

రూ.7,224 కోట్లు కోరిన డిస్కంలు.. అందులో సగానికే ఏపీఈఆర్‌సీ ఆమోదం 

పొదుపు చర్యలు, కొనుగోళ్లలో ఆదాతో గత రెండున్నరేళ్లలో ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం 

సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల వాటిపై అదనపు ఖర్చుల భారం భారీగా పెరిగింది. ఐదేళ్లలో విద్యుత్‌ రంగం అప్పులు రెట్టింపై రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పొదుపు చర్యలు, విద్యుత్తు కొనుగోళ్లలో ఆదా ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత సర్కారు నిర్వాకాల కారణంగా జరిగిన అప్పుల నుంచి బయటపడేందుకు ‘సర్దుబాటు’ చేసుకోక తప్పని పరిస్థితి డిస్కంలకు ఏర్పడింది. కానీ అవి నివేదించిన వ్యయంలో దాదాపు సగానికి మాత్రమే అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. 

ప్రజలపై పెనుభారం పడరాదని..
2014 ఏప్రిల్‌ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య కాలానికి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలను వాస్తవ ఖర్చుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం చేయలేదు. దీంతో రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)లు ఏపీఈఆర్‌సీని కోరాయి. నిజానికి ఇదేమీ వాటి వాస్తవ ఖర్చు కాదు. రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లుగా ఉన్నప్పటికీ అవి రూ.7,224 కోట్లు మాత్రమే అడిగాయి. అయితే అంత మొత్తాన్ని అనుమతిస్తే ప్రజలపై ఒకేసారి భారం పడుతుందనే ఉద్దేశంతో ఏపీఈఆర్‌సీ అందులో సగం మొత్తాన్ని తిరస్కరించింది.

పీఆర్‌సీ, వడ్డీలు, ఇతర ఖర్చులు..
డిస్కంల వినతిపై కొద్ది నెలలుగా ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆడిట్‌ పద్దుల ఆధారంగా డిస్కంలు కోరిన దానిలో దాదాపు సగం అంటే రూ.3,669 కోట్లు వసూలుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ మొత్తంలో రూ.3,100 కోట్లు పే రివిజన్‌ కమిషన్‌(పీఆర్‌సీ) వల్ల అదనపు ఖర్చులు కాగా వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.569 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అదనపు వ్యయాన్ని సెప్టెంబర్‌ విద్యుత్‌ బిల్లు నుంచి ప్రారంభించి ఎనిమిది నెలల పాటు ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్‌కు 45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్‌లో యూనిట్‌కు రూ.1.27 చొప్పున ట్రూఅప్‌ పేరిట సర్దుబాటు చేయనున్నారు. 2019 ఏప్రిల్‌ 1 తరువాత కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్‌ వర్తించదు

ఐదేళ్లలో సర్దుబాటు చేయకపోవడంతో...
‘సర్దుబాటు వ్యయం అనేది ఏటా జరగాలి. ఎప్పటికప్పుడు జరిగితే ప్రజలపై పడే భారం చాలా తక్కువ. కానీ 2014 నుంచి 2019 వరకూ అలా జరగకపోవడంతో డిస్కంల అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా సర్దుబాటు చేయకపోతే వాటి మనుగడ కష్టమవుతుంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్‌ వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా రూ.913 కోట్ల అదనపు సర్దుబాటు వ్యయాన్ని అప్పటి సబ్సిడీ విధానాల ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’
– నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి రూ.27,240 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. 
► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ పంపిణీ సంస్థల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది.
► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి పెరిగాయి. 

మరిన్ని వార్తలు