ఇక రైళ్లలోనూ బ్లాక్‌ బాక్సులు

25 Aug, 2023 03:27 IST|Sakshi

తొలిసారిగా వందే భారత్‌ రైళ్లలో ప్రవేశపెట్టాలని నిర్ణయం

 రైల్వే శాఖ నిర్ణయం

సాక్షి, అమరావతి: భారతీయ రైల్వే మరింత ఆధునికతను సంతరించుకుంటోంది. విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్‌ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తద్వారా ప్ర­మా­దాలు సంభవి­స్తే సమగ్ర విశ్లేషణకు అవకాశం ఏర్ప­డనుంది. తొలిసారిగా వందే భారత్‌ రైళ్లలో బ్లాక్‌ బాక్సులు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలకు విధివిధానాలను నిర్దేశించింది. సెప్టెంబర్‌ నుంచి రూపొందించే రైళ్లలో బ్లాక్‌ బాక్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతోపాటు రైలు ఇంజిన్లు, బ్రేకులు, ఇతర అంశాల్లో కూడా భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనుంది. 

సీసీఆర్‌సీవీఆర్‌ పరిజ్ఞానంతో..
కేబిన్‌ క్రూ రెస్ట్‌ కంపార్ట్‌మెంట్‌ వీడియో రికార్డింగ్‌ (సీ­సీ­ఆర్‌సీవీఆర్‌) సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్‌ బాక్సులు తయారు చేస్తారు. విమానాల్లోని బ్లాక్‌ బాక్సులను కూడా అదే సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. చిత్తరంజన్‌లోని  లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేసే వందేభారత్‌ రైళ్లలో ఈ బ్లాక్‌ బాక్సులను ప్రవేశపెడతారు. అందుకోసం డిజైన్లు ఖరారు చేశారు.

సెప్టెంబర్‌లో తయారు చేసే వందేభారత్‌ రైళ్లలో వాటిని ప్రవేశపెట్టిన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో పరీక్షించి తుది ఆమోదం తెలుపుతారు. రైలు డ్రైవర్‌ కేబిన్‌లో అన్ని కదలికలను ఈ బ్లాక్‌బాక్సులు రికార్డు చేసి ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తాయి. రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఆ బ్లాక్‌ బాక్సులో రికార్డు అయిన సమాచారం భద్రంగా ఉంటుంది. దీంతో ప్రమాద కారణాలను సహేతుకంగా విశ్లేషించి ఇక­ముందు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

మరిన్ని వార్తలు