ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వాయిదా 

22 Mar, 2022 04:17 IST|Sakshi
తిరుపతి కోర్టు సముదాయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

జూన్‌ 21కి వాయిదా వేసిన జిల్లా జడ్జి

తిరుపతి లీగల్‌/తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్‌ 1న ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్డి సత్యానంద్‌ జూన్‌ 21వ తేదీకి వాయిదా వేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులు కలిసి టీటీడీ పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రూ.100 కోట్లు పరువు నష్టం చెల్లించేటట్లు ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆదేశించాలని టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది పరువు నష్టం కేసును దాఖలు చేసింది.

టీటీడీ తరఫున ఈ కేసును బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. సోమవారం కేసు విచారణకు ఎంపీ హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్‌ 29న రిటర్న్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టులో దాఖలు చేశారని, ఆ స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దంటూ గత వాయిదా అప్పుడు ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కొన్ని కారణాలతో కోర్టు ఆ పిటిషన్‌ రిటర్న్‌ చేయగా సోమవారం ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆ పిటిషన్‌ను తీసుకుని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి తిరిగి జడ్జికి ఆ పిటిషన్‌ ఇచ్చారు. అలాగే ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరఫున వాదించడానికి అడ్వొకేట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 32 కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్‌ 21కి వాయిదా వేశారు. 

కేసును వాదించే న్యాయ అవగాహన ఉంది 
టీటీడీ తరఫున కోర్టులో పరువు నష్టం కేసును వాదించే న్యాయ అవగాహన తనకుందని ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. కేసు వాయిదా అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారంపై ఇదివరకే రాష్ట్ర హైకోర్టులో తాము విజయం సాధించామన్నారు. వచ్చే వాయిదాకు ఆంధ్రజ్యోతి వేసిన పిటిషన్‌పై తాము బదులు ఇస్తామన్నారు. కాగా, సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి మూలమూర్తిని ఎంపీ సుబ్రమణ్యస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఆధ్వర్యంలో తిరుమల మరింత అభివృద్ధి చెందిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ హిందూ ఆలయాల్లో క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తున్నారనేది అసత్యమన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. 

మరిన్ని వార్తలు