హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు

30 Jul, 2021 04:59 IST|Sakshi

రాజ్యసభలో..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను హోంశాఖకు పంపినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ – క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులు హోంశాఖ పరిశీలనలో ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్‌ శక్తి కింద ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌  రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరైనట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకసింగ్‌ చెప్పారు. జేఈఈ, నీట్‌లో కూడా రాణించేందుకు వీలుగా ఈ పాఠశాలల్లో ఎంపిక చేసిన ఇంటర్‌ విద్యార్థులకు దక్షణ ఫౌండేషన్‌ ద్వారా ప్రత్యేకంగా కోచింగ్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1,570 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయగా 216 పంచాయతీల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి దేవుసింగ్‌ చౌహాన్‌ తెలిపారు. మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో వైర్‌లెస్‌ద్వారా 8,07,504 టీబీ డాటాను వినియోగించారని, ఇది దేశంలోనే రెండో అత్యధికమని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 

లోక్‌సభలో..
ఏపీ స్మార్ట్‌ సిటీల్లో 251 ప్రాజెక్టులు
స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా ఏపీలో రూ.7,740.83 కోట్ల విలువైన 251 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిషోర్‌ చెప్పారు. కాకినాడలో రూ.911.85 కోట్ల విలువైన 55 ప్రాజెక్టులు, తిరుపతిలో రూ.201 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు, విశాఖపట్నంలో రూ.646.32 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. అమరావతిలో రూ.2,046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు వర్క్‌ ఆర్డ ర్‌ దశలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు సంబంధించి రూ.7,798 కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌రాణే తెలిపారు. విశాఖపట్నంలో సెంట ర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్, షిప్‌బిల్డింగ్‌ ప్రాజెక్టు చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు