10 లక్షల మంది బాలికలకు ‘స్వేచ్ఛ’ 

23 Sep, 2023 04:40 IST|Sakshi

ఏటా 12 కోట్ల శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీ 

ప్రతి నెలా కోటి చొప్పున నాలుగు నెలలకు ఒకసారి.. 

10,144 స్కూళ్లు, కళాశాలల్లో 10 లక్షల మందికి అందజేత 

రుతుక్రమ సమయంలో ఇబ్బందులకు చెక్‌ 

ఈ ఏడాది రూ.35 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ‘స్వేచ్ఛ’ పథకం కింద శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి గాను మొదటి విడతగా జూన్‌లో ప్యాడ్స్‌ అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్‌ నెలలో ప్రారంభించనున్నారు. బాలికల స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌కు కారణమవుతున్న రుతుక్రమ సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయంలో పాఠశాల, కాలేజీ మానేస్తున్నారు. దీంతో డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని నివారించడంతో పాటు రుతుక్రమం సమయంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన(బ్రాండెడ్‌) శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 10,144 పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థినులకు అందిస్తోంది. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఈ ఏడాది నుంచి పాఠశాల విద్యాశాఖలోని మధ్యాహ్న భోజన విభాగానికి అప్పగించారు.  

వచ్చే నెలలో 4 కోట్ల ప్యాడ్స్‌ పంపిణీకి ఏర్పాట్లు 
దేశంలో 23 శాతం మంది విద్యార్థినులు బహిష్టు సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 10,144 స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఒకొక్కరికి నెలకు 10 ప్యాడ్స్‌ చొప్పున ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.35 కోట్ల నిధులను వెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక పర్యాయం పంపిణీ కార్యక్రమం చేపడుతోంది.

ఈ విద్యా సంవత్సరంలో సెపె్టంబర్‌ వరకు అవసరమైన ప్యాడ్స్‌ను జూన్‌ నెలలో అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. దీంతో రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోను నెలకు ఒకసారి మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. వినియోగించిన ప్యాడ్స్‌ను పర్యావరణ హితంగా నాశనం చేసేందుకు ప్రత్యేక డస్ట్‌బిన్లు, యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. 

మరిన్ని వార్తలు