వచ్చేనెల నుంచి చిరుధాన్యాల పంపిణీ

11 Mar, 2023 04:46 IST|Sakshi

పైలట్‌ ప్రాజెక్టుగా రాయలసీమ జిల్లాల్లో అమలు 

రాగులు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరణ 

ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నల కొనుగోళ్లు 

రైతులను ప్రోత్సహించేలా కొన్న వెంటనే నగదు చెల్లింపులు 

సాక్షి, అమరావతి :  బియ్యం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీకి రంగం సిద్ధంచేస్తోంది. తొలిదశలో వచ్చేనెల నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో అమలుచేయనుంది. లబ్ధిదారులకు ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో రెండు కేజీల బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేస్తుంది.

ఇందులో భాగంగా పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలను మద్దతు ధరకు (రాగులు–రూ.3,578.. జొన్నలు రూ.2,970 (హైబ్రిడ్‌), రూ.2,990 (మల్దండి))కొనుగోలు చేస్తోంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొ నుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. 

కర్ణాటక నుంచి రాగుల సేకరణ 
రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్‌ నుంచి రాగుల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా 25 వేల టన్నుల రాగులను సేకరిస్తోంది. మరోవైపు.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జొన్నల కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు తెరిచింది.

అయితే, మద్దతు ధర కంటే మార్కెట్‌ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జొన్నల పంపిణీకి వీలుగా, రైతులకు మరింత మేలు చేసేలా మద్దతు ధరను పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.  

లబ్దిదారుల ఆసక్తి మేరకు.. 
ఇక రాయలసీమ జిల్లాల్లోని బియ్యం కార్డుదారుల ఆసక్తి మేరకు ప్రతినెలా ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు రాగులను అందించనున్నారు. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్‌కు తరలిపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నెమ్మదిగా సాగుతోంది.

ఇప్పటివరకు 500 టన్నులే సేకరించింది. దీంతో భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సాహాకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో డిమాండ్, సప్లైకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది.  

పేదలకు బలవర్థకమైన ఆహారం 
రాష్ట్రంలో ప్రజలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం జగన్‌ సంకల్పానికి అనుగుణంగా వచ్చేనెల నుంచి పేదలకు చిరుధాన్యాలు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో రాగుల నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరించి ఇక్కడ పంపిణీ చేస్తాం. ఇప్పటికే జొన్నల సేకరణ చేపట్టాం. 
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు,  పౌరసరఫరాల శాఖ మంత్రి  

విస్తీర్ణం పెంచేలా చర్యలు 
రాష్ట్రంలో రేషన్‌ కింద రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నాం. బియ్యం కార్డుదారుల అవసరానికి అనుగుణంగా పంట ఉత్పత్తులు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. చిరుధాన్యాలకు మార్కెట్‌లో మంచి రేటు ఉంది. జొన్నలకు పౌల్ట్రీ రంగంలో డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ సేకరణ నెమ్మదిగా ఉంది. అందుకే మద్దతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ రాశాం.  
– హెచ్‌.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌  
 

మరిన్ని వార్తలు