రామోజీ.. ఇదేం డ్రామా!

20 Dec, 2023 05:14 IST|Sakshi
ఈనాడు వెబ్‌సైట్‌లో రాష్ట్రం రుణం పొందేందుకు కేంద్రం అనుమతి అంటూ పెట్టిన వార్త

వెబ్‌సైట్‌లో వాస్తవాలు.. పత్రికలో అబద్ధాలా?

అవకాశం ఉన్నా అప్పు తీసుకోలేదని పత్రికలో రాయలేదు ఎందుకు?

సాక్షి, అమరావతి: రామోజీ రాతల్లో దురుద్దేశాలను పాఠకులు కష్టపడి గ్రహించాల్సిన అవసరం లేదు! ఎందుకంటే తన సొంత పత్రిక, వెబ్‌సైట్‌ ద్వారా వాటికి ఆయనే కౌంటర్లు వేసుకుంటున్నారు కాబట్టి!! కేంద్రం వద్దంటున్నా, ఆర్బీఐ హెచ్చరిస్తున్నా బేఖాతరంటూ రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని ఈనాడు మంగళవారం ఓ కథనాన్ని అచ్చేసింది. అదే రోజు ‘ఈనాడు డాట్‌నెట్‌’ మాత్రం అందుకు విరుద్ధంగా మరో కథనాన్ని వదిలింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకుగాను అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందనేది ఆ వార్త సారాంశం.

2021–22లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కగా ఈసారి మాత్రం ఆరు రాష్ట్రాలకే అవకాశం లభించిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఉందని వెబ్‌సైట్‌ స్పష్టంగా పేర్కొంది. ఈ వెసులుబాటుతో ఏపీ రూ.5,858 కోట్ల రుణాన్ని 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్‌ నుంచి అదనంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సామాజిక మాధ్యమం (ఎక్స్‌) ద్వారా స్వయంగా వెల్లడించారు.

అదనపు రుణాలు పొందేందుకు అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అలా తీసుకోలేదు. ఈనాడు పత్రిక మాత్రం రుణాలు ఎక్కువ తీసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం వద్దంటోందని అడ్డగోలుగా అబద్ధాలను వండి వార్చింది. అదే మీడియాకు చెందిన వెబ్‌సైట్‌ మాత్రం వాస్తవాలను బహిర్గతం చేయడంతో రామోజీ పన్నాగం బెడిసికొట్టింది. ఆయన ద్వంద్వ వైఖరికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి? 

>
మరిన్ని వార్తలు