అర్హులను నిర్ణయించేది ప్రజా ప్రభుత్వాలే

7 Sep, 2021 04:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు చాలా పరిమితమని తెలిపారు. ఓ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయాలు ప్రభుత్వాల పరిధిలోనివని వివరించారు. 60 ఏళ్లు దాటిన వారు వైఎస్సార్‌ చేయూత పథకానికి అనర్హులని, అయితే అలాంటి వారు పెన్షన్‌ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల వయో పరిమితి ఎంత ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయాలను న్యాయస్థానాలు ఎంతమాత్రం నిర్ణయించజాలవన్నారు. ఇలాంటి పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషనర్లలో వైఎస్సార్‌ చేయూత కింద ఎంతమందికి చెల్లింపులు చేశారు? చెల్లించకుంటే ఎందుకు చెల్లించలేదు? పిటిషనర్లలో ఎవరికైనా షోకాజ్‌ నోటీసులు ఇచ్చారా? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సదుద్దేశంతో ప్రవేశపెడుతున్నా..
వైఎస్సార్‌ చేయూత పథకం కింద లబ్ధి పొందేందుకు తాము అర్హులైనప్పటికీ అధికారులు ఆ ప్రయోజనాలను వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన వేల్పుల విమలమ్మ, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ వారికి ఆ పథకం కింద ప్రయోజనాలను వర్తింప చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఫించన్‌ చెల్లింపుల నిలుపుదలపై మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ తాజాగా విచారణ జరిపారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పథకాలను ప్రవేశపెడుతున్నా కొందరు అధికారుల తీరు వల్ల వాటి ఫలాలు అర్హులకు అందడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందక 90 శాతం మంది అర్హులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒకసారి ఓ పథకానికి అర్హులుగా నిర్ణయించిన తరువాత మధ్యలో ఆ పథకం ప్రయోజనాలను నిలుపుదల చేయడం సరికాదన్నారు. అధికారుల అలసత్వం వల్ల పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదన్నారు. 

అర్హులందరికీ దక్కాలన్నదే సీఎం సంకల్పం..
దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ స్పందిస్తూ పథకం అర్హతలు, అర్హులను న్యాయస్థానాలు నిర్ణయించజాలవన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కాలన్నదే ముఖ్యమంత్రి కృత నిశ్చయమన్నారు. ఆ దిశగానే పథకాల రూపకల్పన జరుగుతోందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టనన్ని వాటిని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి పత్రికా కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుకు అధికారులతో మాట్లాడతామని తెలిపారు. ఈ కేసులో అర్హులకు వైఎస్సార్‌ చేయూత ప్రయోజనాలను వర్తింప చేశామన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు