అడ్మిషన్లు అదుర్స్

9 Feb, 2021 05:15 IST|Sakshi

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో భారీగా చేరికలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. గత నాలుగైదేళ్లలో లేని విధంగా విద్యార్థులు ఇంజనీరింగ్‌ కోర్సుల వైపు దృష్టి సారించారు. కోవిడ్‌ కారణంగా విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చాలా ఆలస్యమైనప్పటికీ.. అడ్మిషన్లు గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉన్నాయి. ఉన్నత విద్యలో,  సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర విద్యాసంస్థల్లో చేరికకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా నిధులు సమకూరుస్తుండడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లోకి విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ ఏడాది కన్వీనర్‌ కోటా సీట్లు 73 శాతానికి పైగా భర్తీ అవ్వడం దీనికి తార్కాణం. 

75,515 సీట్లు భర్తీ
ఏపీ ఎంసెట్‌–2020 ప్రవేశాల ప్రక్రియ కోవిడ్‌ కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌–2020 అడ్మిషన్లలో భాగంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ గత ఏడాది అక్టోబర్‌ చివర్లో ఆరంభమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ ఏడాది జనవరి 3న చేపట్టగా కన్వీనర్‌ కోటాలోని 1,04,090 సీట్లలో 72,867 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం మూడో విడత సీట్ల కేటాయింపు ముగియగా కన్వీనర్‌ కోటాలో 75,515 సీట్లు భర్తీ అవ్వగా 28,575 సీట్లు ఇంకా మిగిలాయి. ఈ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ వర్సిటీ కాలేజీల్లోని సీట్లు 90 శాతానికి పైగా భర్తీ కాగా ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు భారీగా మిగిలాయి.

కాలేజీలు తగ్గినా..
ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా అనేక పథకాలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉన్నత విద్య ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ఇందుకు దోహదపడిందని, అనేక కాలేజీలను కౌన్సెలింగ్‌ నుంచి తప్పించినప్పటికీ భారీ సంఖ్యలో చేరికలు ఉండటం గమనార్హమని వారు చెబుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రమాణాలు లేని కాలేజీలు వాటిని సర్దుబాటు చేసుకొనేందుకు ప్రభుత్వం కొంత సమయమిచ్చింది.

లోపాలు సరిదిద్దుకోని కాలేజీలపై ఈ విద్యాసంవత్సరం నుంచి చర్యలకు ఉపక్రమించింది. చేరికలు సున్నాకు పడిపోయిన 48 ఇంజనీరింగ్‌ కాలేజీలను ఈసారి కౌన్సెలింగ్‌ నుంచి తప్పించింది. అలాగే వర్సిటీలకు నిబంధనల మేరకు ఫీజులు చెల్లించని 82 కాలేజీలకు ఫస్టియర్‌ సీట్ల కేటాయింపును నిలిపివేసింది. బీఫార్మసీ, డీఫార్మాలో కూడా ఇలాంటి కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగా పలు కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. కాలేజీలు అన్ని విధాలా అర్హతలున్న సిబ్బందిని నియమించుకున్నాయి. ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశాయి.
 

మరిన్ని వార్తలు