ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!

3 Jun, 2022 04:28 IST|Sakshi
నిందితులను చూపుతున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్‌ బ్యాంకు దోపిడీ కేసు బట్టబయలు

శ్రీకాళహస్తి: గత నెల 26న శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్‌ బ్యాంకు దోపిడీ కేసులో బ్యాంకు మేనేజర్‌ స్రవంతితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం 1వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఆయన నిందితుల అరెస్టును మీడియాకు చూపారు. బ్యాంకు దోపిడీ కేసులో మేనేజర్‌ స్రవంతిదే కీలకపాత్రని వెల్లడించారు. పట్టణంలో ముత్యాలమ్మ గుడి వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న స్రవంతి ఐదేళ్లుగా ఫిన్‌కేర్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే వీధికి చెందిన జనసేన నేత విజయకుమార్‌తో సన్నిహితంగా ఉంటోంది.

అలాగే అదే ప్రాంతానికి చెందిన నవీన్, సుల్తాన్‌లతోనూ స్రవంతికి స్నేహం ఉంది. నవీన్, సుల్తాన్‌లు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం నుంచి స్రవంతి బ్యాంకులో పలు అవకతవకలకు పాల్పడింది. తన స్నేహితులు, తెలిసినవారి పేర్లతో పెద్ద ఎత్తున నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందింది. ఆడిటింగ్‌లో దొరక్కుండా జాగ్రత్త పడింది. ఎప్పటికీ దొరకకుండా ఉండేందుకు తన మిత్రులు ముగ్గురితో కలిసి డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగా విజయకుమార్, సుల్తాన్, నవీన్, చెన్నైకు చెందిన హుస్సేన్, గురురాజ్, ఆంటోనీరాజ్, అరుణ్‌తో కలిసి పథకం వేశారు.

గత నెల 26 అర్ధరాత్రి స్రవంతి బ్యాంకులో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె స్నేహితులు బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న నగలు, నగదును బ్యాగులో వేసుకుని వెళ్లిపోయారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్‌డిస్కులను తీసుకెళ్లిపోయారు. అయితే స్రవంతి దోపిడీకి ముందే బ్యాంకులో కొంత బంగారాన్ని ఇంట్లోనే దాచేసింది.

పోలీసుల విచారణలో దోపిడీలో స్రవంతిని కీలక సూత్రధారిగా నిర్ధారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదు, 1274 గ్రాముల నగలు, 874 గ్రాముల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. అసలు బంగారు ఆభరణాలను తీసుకువెళ్లిన స్రవంతి వాటిని పలు ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు గుర్తించారు.  

మరిన్ని వార్తలు