13 గంటలు.. ప్రాణాలు అరచేతిలో..

20 Sep, 2020 12:04 IST|Sakshi
బ్రిడ్జిపైకి తీసుకువచ్చిన దృశ్యం

నెల్లూరు(క్రైమ్‌): ఓ వ్యక్తి పెన్నావరద నీటిలో చిక్కుకుపోయాడు. 13 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద అతడిని రక్షించారు. వివరాలు.. గూడూరు పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన రామ్‌బాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ సమీపంలోని పెన్నానూతన బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో వెనక్కురాలేక అక్కడే నీటిలో చిక్కుకుపోయాడు. అతికష్టంపై బ్రిడ్జి పిల్లర్‌ను పట్టుకుని వేలాడసాగాడు. రాత్రంతా అక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపాడు.

శనివారం ఉదయం బ్రిడ్జి పిల్లర్‌ను పట్టుకుని వెళ్లాడుతున్న అతడిని స్థానికలు గుర్తించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. నెల్లూరు అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో రెస్క్యూటీం రంగంలోకి దిగి అతడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి రోప్‌సహాయంతో పిల్లర్‌పైకి దిగారు. రాంబాబుకు లైఫ్‌జాకెట్‌ వేసి రోప్‌సాయంతో బ్రిడ్జిపైకి తీసుకువచ్చారు. అనంతరం 108లో బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఆపరేషన్‌లో లీడింగ్‌ ఫైర్‌మన్‌ ఎం.సుధాకర్, ఫైర్‌మెన్లు హజరత్, నారాయణ, శేషయ్య, డ్రైవర్‌ పవన్‌కుమార్‌ ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా