వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్‌ 

17 Sep, 2021 17:51 IST|Sakshi
రోడ్డును ఆక్రమించి, గల్లా ఫుడ్స్‌ ఫ్యాక్టరీ నిర్మించుకున్న ప్రహరీ

లక్ష్మీపురంలో రెండు దశాబ్దాలుగా వివాదం

2000లో ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా రోడ్డు నిర్మాణం 

2014లో రోడ్డును ఆక్రమించి గోడ కట్టేసుకున్న గల్లా ఫుడ్స్‌ యాజమాన్యం

అప్పటి నుంచి గ్రామస్తుల ఎడతెగని పోరాటం

తాజాగా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన వైనం

తిరుపతి నగర శివారు కరకంబాడిలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీల భూ ఆక్రమణ, దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడం అందరికీ తెలిసిందే. ఆ ఫ్యాక్టరీలే కాదు ఆయా యాజమాన్యాలకే చెందిన గల్లా ఫుడ్స్‌ నిర్వాకం వాటికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఊరి కోసం గ్రామస్తులు సాధించుకున్న రోడ్డును సైతం మింగేసి.. రైతుల పొలాలను నిరుపయోగం చేసిన వైనంపై ఇప్పుడు జిల్లాలో వివాదం రగులుతోంది. (చదవండి: దలాల్ స్ట్రీట్: అతిగా ఆశపడ్డారో అంతే!!)  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అమరరాజా ఫ్యాక్టరీల యాజమాన్యానికి చెందిన గల్లాఫుడ్స్‌ భూ ఆక్రమణలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. పూతలపట్టు మండలం తేనేపల్లి రెవెన్యూ గ్రామంలో 2011 సంవత్సరంలో ఏపీఐఐసీ అధికారులు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ కోసం భూ సేకరణ చేపట్టగా గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. 12 ఎకరాల 30 సెంట్ల పంటపొలాల సేకరణతో పాటు లక్ష్మీపురం గ్రామానికి వెళ్లే రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు నంబర్‌ డబ్ల్యూపీ 15308/2011తో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

వాస్తవానికి ఆ రోడ్డును 2000 సంవత్సరంలో నాటి ఎంపీ, దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో నిర్మాణం చేపట్టారు. దాదాపు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం చిత్తూరు ఆర్డీఓకి ఆదేశాలు జారీచేసింది. గ్రామస్తుల అభ్యంతరాలతో 2012లో అప్పటి ఆర్డీఓ భూసేకరణను నిలిపివేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉందనుకున్నా మళ్లీ 2014లో గల్లా ఫుడ్స్‌ ప్రమేయంతో సమస్య మొదటికొచ్చింది.

2014లో గల్లా మాస్టర్‌ప్లాన్‌ 
2014లో గల్లా ఫుడ్స్‌ యాజమాన్యం పూతలపట్టు మండలం పేటఅగ్రహారం గ్రామంలోని కొన్ని భూములను ఏపీఐఐసీ నుంచి రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ) పేరిట సేకరించింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న తేనేపల్లిలోని ఆ 12 ఎకరాల 30 సెంట్ల రైతుల భూములను కొట్టేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఆ పొలాలకు వెళ్లే బీటీ రోడ్డును గల్లా ఫుడ్స్‌ కంపెనీ భూముల్లోకి కలిపేసుకుని భారీ ఎత్తున ప్రహరీ గోడ కట్టేసింది.

దీంతో రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  ఫలితంగా గ్రామస్తులు తిరిగి హైకోర్టుకు వెళ్లి ఆర్డీఓపై 2017లో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇందుకు ఆర్డీఓ కోర్టులో సమాధానమిస్తూ భూసేకరణ ఎప్పుడో నిలిపివేశామని, ఈ విషయం కోర్టు ధిక్కరణ కిందకు రాదని విన్నవించారు. దీంతో  చట్ట ప్రకారం గ్రీవెన్స్‌ ద్వారా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం రైతులకు సూచించింది. ఇక అప్పటి నుంచి రైతులు, గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండానే పోయింది.

జేసీకి విచారణ బాధ్యత  
ఊరి రోడ్డును గల్లా ఫుడ్స్‌ ఆక్రమించిందంటూ తేనెపల్లి రెవెన్యూ విలేజ్‌ లక్ష్మీపురం గ్రామస్తులు నాకు ఫిర్యాదు చేశారు. నేను వాస్తవ నివేదిక తెప్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరాను. మొత్తంగా ఆ వ్యవహారంపై విచారణ బాధత్యలను జేసీకి అప్పగించాను.  
– హరినారాయణన్, జిల్లా కలెక్టర్‌

ఇప్పటికైనా న్యాయం చేయాలి 
ప్రభుత్వ ఆస్తి అయిన రోడ్డును ఆక్రమించి, రైతుల పొలాలకు ప్రవేశాన్ని అడ్డగించి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్న గల్లా ఫుడ్స్‌ యాజమాన్యంపై అధికారులు ఇప్పటికైనా సీరియస్‌గా దృష్టి సారించాలి. గల్లా ఫుడ్స్‌ దౌర్జన్యం ఫలితంగా 335, 337/1 సర్వే నంబర్లలో నాకున్న ఏడు ఎకరాల పొలం దాదాపు ఆరేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయింది. మేము ఎన్ని సార్లు మా పొలంలోకి వెళ్లేందుకు యత్నించినా గల్లా ఫుడ్స్‌ సంబంధీకులు అడ్డుకుంటున్నారు. అధికారబలంతో బెదిరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గల్లా ఫుడ్స్‌ ఆక్రమణలను తొలగించి రైతులకు న్యాయం చేయాలి. 
– గాలి పురుషోత్తం నాయుడు, రైతు, తేనేపల్లి

మా ఊరికే రోడ్డు లేకుండా చేశారు  
గల్లా ఫుడ్స్‌ రాకతో మా ఊరికి రోడ్డు లేకుండా పోయింది. ఉన్న బీటీ రోడ్డును ఎంచక్కా ఆక్రమించి, కంపెనీ ప్రహరీగోడ చుట్టూ ఓ గతుకుల రోడ్డు వేసింది. ఇది వాడుకోండి అంటున్న ఫ్యాక్టరీ నిర్వాకంపై అధికారులు దృష్టి సారించాలి. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, న్యాయం చేయాల్సి ఉంది. 
–గురుస్వామి, వజ్రాలశెట్టి రాజేశ్, హరి, తులసీనాథ్‌

మాకు అన్యాయం చేశారు 
మా పొలాలను ఆక్రమించేసుకుని చుట్టూ గోడ కట్టేసుకున్నారు. ఇదేమిటని అడిగితే పరిహారం ఇస్తామని అన్నారు. మొత్తంగా మా పొలాలకు రూ.80 లక్షల పరిహారం వస్తుందని లెక్కగట్టగా రూ.8లక్షలు ఇచ్చి బెదిరించి పంపించివేశారు.  
– మహేశ్వరమ్మ, మహిళా రైతు, లక్ష్మీపురం

చదవండి:
లిప్‌స్టిక్ తయారిలో వాడే గింజలు ఏంటో తెలుసా..!  

మరిన్ని వార్తలు