ఉన్నతాధికారులకు మరో అవకాశం

23 Jun, 2021 04:19 IST|Sakshi

ధిక్కరణ కేసులో కోర్టు ఆదేశాలను అమలు చేస్తామన్న ఎస్‌జీపీ సుమన్‌

గిరిజా శంకర్, చిరంజీవి చౌదరికి జైలుశిక్ష, జరిమానా ఉత్తర్వులు వెనక్కి

రెండు వారాలు గడువు ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు న్యాయస్థానం మరో అవకాశం ఇచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన హైకోర్టు.. న్యాయస్థానం ఆదేశాల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని ఇద్దరు అధికారులు అభ్యర్థించడంతో సానుకూలంగా స్పందించి జైలు శిక్ష, జరిమానా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏం జరిగిందంటే..
విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం అదే నెలలో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్‌.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మ«ధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. కోర్టు ఆదేశాల మేరకు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరు కాగా నెల రోజులు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ ఇద్దరు అధికారుల తరఫున హాజరై కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. సుమన్‌ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ విచారణను వాయిదా వేశారు.

హెచ్‌ఆర్‌సీలో సదుపాయాలపై వివరాలివ్వండి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)కి కార్యాలయం, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం హైదరాబాద్‌లో ఎందుకు ఉంది? అది ఏపీ భూ భాగం నుంచి ఎందుకు పనిచేయడం లేదో కూడా చెప్పాలంది. తదుపరి విచారణను జూలై 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌సీ పనిచేసేందుకు వీలుగా కార్యాలయం, సిబ్బంది, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని, దీంతో ఫిర్యాదు తీసుకుని విచారించడం సాధ్యం కావడంలేదంటూ ఏపీ పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.  

మరిన్ని వార్తలు