మెట్ట కష్టాలు గట్టెక్కేలా..

9 May, 2021 03:37 IST|Sakshi
చింతలపూడి ఎత్తిపోతల నిర్మాణ పనులు

సాగర్‌ ఎడమ కాలువకు గోదారి జలాలు

2022 నాటికి చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేసే లక్ష్యంతో సర్కారు చర్యలు

23 నెలల్లో రూ.875.12 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం 

ప.గో జిల్లా మెట్ట ప్రాంతంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు

సాగర్‌ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

అటవీ అనుమతులు రాగానే వేగంగా ‘జల్లేరు’ పూర్తికి ప్రణాళిక

సాక్షి, అమరావతి: మెట్ట ప్రాంత సాగునీటి కష్టాలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2022 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలు వెరసి మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రణాళికతో వడివడిగా అడుగులు వేస్తోంది. సమీపాన గోదావరి నదిలో వరద వెల్లువెత్తుతున్న సమయంలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత భూములకు సాగునీరు.. ప్రజల తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. సముద్రం పాలవుతున్న గోదావరి వరద జలాలను ఒడిసిపట్టి ఈ గడ్డు పరిస్థితులను అధిగమించే చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

మరో రూ.1,778 కోట్లతో పూర్తి చేసేలా..
పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు అక్కడి ప్రజల దాహార్తిని తీర్చడం, సాగర్‌ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో జలవనరుల శాఖ చేర్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23 నెలల్లోనే ఈ పనులకు రూ.875.12 కోట్లను ఖర్చు చేశారు. మరో రూ.1,778 కోట్లను వెచ్చించడం ద్వారా ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ స్వరూపమిలా
గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోస్తారు. ఆ నీటిని నిల్వ చేయడానికి 8 టీఎంసీల సామర్థ్యంతో జల్లేరు రిజర్వాయర్‌ నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి అది సరిపోదని నీటి పారుదల నిపుణులు తేల్చారు. దీంతో రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు పెంచారు. 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.5,532 కోట్లు.. ఇప్పటివరకు రూ.3,754 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.1778 కోట్ల విలువైన మిగిలాయి.

రెండో దశ పనులు కొలిక్కి..
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో తొలి దశ పనులు అంటే.. గోదావరి వద్ద పంప్‌ హౌస్, 36 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశలో 68 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. పంప్‌ హౌస్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచడం వల్ల 1,700 హెక్టార్లు ముంపునకు గురవుతుంది. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే తొలి దశ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసింది. ముంపునకు గురయ్యే భూమికి బదులుగా అనంతపురం జిల్లాలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి కేటాయించిన భూమిని అటవీ శాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూమిని అప్పగించడంతోపాటు అటవీ శాఖకు నష్టపరిహారం చెల్లించడం ద్వారా రెండో దశ అటవీ అనుమతులను సాధించి, జల్లేరు రిజర్వాయర్‌ పనులకు మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓ వైపు జల్లేరు రిజర్వాయర్‌ నిర్మాణ పనులను చేపడుతూనే.. మరోవైపు ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది.

గడువులోగా చేస్తాం
చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. తొలి దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశ పనులు శరవేగంగా చేస్తున్నాం. జల్లేరులో ముంపునకు గురయ్యే భూమికి బదులుగా అనంతపురం జిల్లాలో ఏపీఐఐసీకి కేటాయించిన భూమిని అటవీశాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో దశ అటవీ అనుమతులు సాధించి జల్లేరు రిజర్వాయర్‌ పనులు చేస్తూనే.. ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించాం.
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు