Maddila Gurumoorthy: ఇది ప్రజావిజయం

3 May, 2021 03:53 IST|Sakshi
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న గురుమూర్తి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

తిరుపతి ఎంపీ గురుమూర్తి 

నెల్లూరు (సెంట్రల్‌)/తిరుపతి తుడా: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో తన విజయం ప్రజా విజయమని ఎంపీగా గెలుపొందిన మద్దిల గురుమూర్తి చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆదివారం ఆయన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో కలిసి నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం డీకేడబ్ల్యూ కళాశాలలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చక్రధర్‌బాబు నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు.

అనంతరం అక్కడ, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కేంద్రం వద్ద గురుమూర్తి విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని, సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు తనను దీవించారని చెప్పారు. ముఖ్యమంత్రికి తాను రుణపడి ఉంటానని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల మద్దతుతో గెలిపించిన సీఎం జగన్‌ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేస్తానని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

సీఎం అడుగుజాడల్లో నడవడమే తన లక్ష్యమన్నారు. ఈ విజయం జగనన్నదేనని చెప్పారు. సాధారణ వ్యక్తి అయిన తనను పార్లమెంట్‌కు పంపించాలన్న జగనన్న సంకల్పం గొప్పదన్నారు. ఇలాంటి మంచి మనసున్న జగనన్న దేశ రాజకీయాల్లో సరికొత్త ముద్ర వేస్తున్నారని తెలిపారు. ధ్రువీకరణపత్రం అందుకునే కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పి.రూప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు