ఉపాధి హామీ బిల్లులు రెండు వారాల్లో చెల్లించండి 

24 Aug, 2021 04:01 IST|Sakshi

  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన బకాయిలను రెండు వారాల్లో పిటిషనర్లందరికీ చెల్లించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బకాయిలు చెల్లించకపోవడం పౌరులు హుందాగా జీవించే హక్కును హరించే విధంగా ఉందంది. కొందరికి బకాయిలు చెల్లించామని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించడంలేదంటూ దాఖలైన పిటిషన్లపై  సోమవారం మరోసారి విచారణ జరిగింది. బకాయిల డబ్బు పిటిషనర్ల ఖాతాల్లో జమ కాలేదని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు.  

పంచాయతీరాజ్‌ శాఖ న్యాయవాది వడ్లమూడి కిరణ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖర్చు చేయని నిధులు ఉన్నాయన్న కేంద్రం వాదన సరికాదన్నారు. రాష్ట్రం అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని కేంద్రం నిధుల విడుదల సమయంలో సర్దుబాటు చేసుకుందని తెలిపారు. ఇప్పటికే బకాయిలను ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందన్నారు. బకాయిలను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ, పిటిషనర్లకు బకాయిలను మాత్రం రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు