కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మెరుగుపడిన రోడ్లు

28 Apr, 2022 14:55 IST|Sakshi
తిమ్మనాయునిపేట- రెడ్డిపల్లె రోడ్డు

తొలగిన వాహనదారుల కష్టాలు

రూ.186.10 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే రూ.44.32 కోట్లతో 28 పనులు పూర్తి

ఎన్‌డీబీ రుణంతో మరో 12 కొత్త రోడ్ల నిర్మాణం 

కర్నూలు(అర్బన్‌): రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విరివిగా నిధులను విడుదల చేస్తూ రహదారుల రూపు రేఖలు మారుస్తోంది. దీంతో పల్లెల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల ప్రయాణ కష్టాలు తొలగి పల్లె ప్రాంతాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. గుంతలు పడి, కంకర తేలి నడవడానికి వీలు లేని రోడ్లు సైతం నేడు పూర్తిగా మారిపోయాయి. ఆయా రహదారుల్లో వాహనాల వేగం ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతలను పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం తీసుకుంది. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లను అభివృద్ధి చేయడం, జిల్లా రహదారులను మరమ్మతు చేయడం.. తదితర బాధ్యతలు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు చూసుకుంటున్నారు.  

ఇరు జిల్లాల్లో 100 పనులు 
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.107.61 కోట్ల రుణం ఇవ్వగా 494.500 కిలోమీటర్ల  జిల్లా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వీటిలో మొత్తం 70 పనులకు గాను 14 పూర్తయ్యాయి. పురోగతిలో 17 పనులు  ఉండగా, మిగిలిన వాటిలో 37 ప్రారంభం కావాల్సి ఉంది. రెండు పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర రహదారులకు కాలానుగుణంగా మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి రూ.78.49 కోట్లతో 209.270 కిలోమీటర్ల మేర 30 పనులను చేపట్టారు. ఇప్పటికే రూ. 23.69 కోట్లతో 68.930 కిలోమీటర్ల మేర 14 పనులను పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 8 పనులు పురోగతిలో ఉండగా, మరో 8 పనులను త్వరలో ప్రారంభించనున్నారు.  

రెండు లేన్ల రోడ్లు.. 
న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణంతో రెండు జిల్లాల్లో రూ.314.31 కోట్ల వ్యయంతో మొత్తం 147.18 కిలోమీటర్ల మేర మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్‌ కూడా పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.  

‘డబుల్‌’ ఆనందం 
కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట నుంచి సంజామల మండలం రెడ్డిపల్లె వరకు రోడ్డు అధ్వానంగా ఉండేది. గుంతలు పడి రాకపోకలు సాఫీగా సాగేవి కావు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాహనదారుల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని మొత్తం 19 కిలోమీటర్ల మేర రూ.19.50 కోట్లతో డబుల్‌ రోడ్డుగా మార్చింది. సరికొత్త రూపును దిద్దుకున్న ఈ రోడ్డుపై ప్రస్తుతం వాహనాలు రయ్‌..రయ్‌ అని దూసుకుపోతున్నాయి.  

రాకపోకలు సురక్షితం 
పాణ్యం మండలం కొణిదేడు నుంచి మద్దూరు వరకు సింగిల్‌ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది. వైద్యం నిమిత్తం మద్దూరు ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు తప్పేవి కావు. ప్రజల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 కోట్లు ఖర్చు చేసి దీనిని డబుల్‌ రోడ్డుగా మార్చింది. వారం క్రితమే పనులు పూర్తయ్యాయి. మొత్తం 11 కిలోమీటర్ల రహదారిపై రాకపోకలు మెరుగుపడ్డాయి. ప్రయాణ కష్టాలు తీరాయి. వివిధ గ్రామాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 

తొలగిన ‘దారి’ద్య్రం 
గోనెగండ్ల మండలం పెద్ద మరివీడు నుంచి పెద్ద నేలటూరుకు వెళ్లాలంటే మట్టి రోడ్డే దిక్కయ్యేది. రాళ్లు తేలి నడవడానికి సైతం ఇబ్బందిగా ఉండేది. సుమారు 10 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని చూపేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని రూ. 2.48 కోట్లతో బీటీ రోడ్డుగా మార్చింది. దీంతో రైతులు సులువుగా ఎమ్మిగనూరుకు పంట ఉత్పత్తులు తరలిస్తున్నారు. గూడూరుకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. 

సాఫీగా ప్రయాణం 
మండలకేంద్రమైన కౌతాళం నుంచి ఉరుకుంద వరకు 6 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గతుకుల రోడ్డుపై అవస్థలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. పక్షం రోజుల క్రితం పనులు పూర్తవడంతో ఈ రహదారిపై భక్తుల ఇక్కట్లు తొలగిపోయాయి.   

ఐదు గ్రామాలకు ఎంతో ఉపయోగం 
కరివేముల నుంచి ఐరన్‌బండ బీ సెంటర్‌ వరకు రూ.1.20 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. దీంతో ఐదు గ్రామాలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. గుంతలు పడి కంకర తేలడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు బాగుపడింది.
– నరసింహయ్య, గుమ్మరాళ్ల, దేవనకొండ మండలం 

 ఇబ్బందులు లేవు 
గతంలో కడ్డీల వంక నుంచి రామదుర్గం క్రాస్‌ రోడ్డు వరకు ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లం. గతంలో ఈ రోడ్డును బాగు చేయాలని విన్నవించినా, ఫలితం కనిపించ లేదు. ప్రస్తుత ప్రభుత్వం రూ.70 లక్షలతో 1.50 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించింది. నెల రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. రామదుర్గం గ్రామానికి, పొలాలకు వెళ్లేందుకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.  
– రాఘవయ్య, నగరడోణ, చిప్పగిరి మండలం  

 నిర్ణీత సమయంలోగా  పనులు పూర్తి 
బ్యాంకు రుణంతో చేపట్టిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. రెండు జిల్లాల్లో ఇప్పటికే రూ.44.32 కోట్లతో 28 పనులు పూర్తయ్యాయి. అలాగే ఫేజ్‌–1 కింద ఎన్‌డీబీ రుణంతో చేపట్టనున్న 12 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్‌డీబీ ఫేజ్‌–2 కింద 77.57 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం.  
– శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ 

మరిన్ని వార్తలు