పండ్లు, కూరగాయల నష్టాలకు ఇక చెక్‌ 

23 Aug, 2022 03:26 IST|Sakshi
కొత్తూరు తాడేపల్లిలోని ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రంలో కూరగాయలను పరిశీలిస్తున్న మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి

ఉద్యాన పంటలు సాగయ్యే ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం 

కోల్డ్‌ స్టోరేజ్‌లు కూడా.. 

మొత్తం 945 కేంద్రాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ 

ఇప్పటికే 32 కేంద్రాల నిర్మాణం పూర్తి.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలకు కోత అనంతరం నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీకేల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, కోల్డ్‌ స్టోరేజీని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లిలో నిర్మించిన ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి కాకాణి ప్రారంభించారు. 75 శాతం సబ్సిడీతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం కోసం వీటిని నిర్మించారు.

ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) పరిధిలో రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మంత్రి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ద్వారా నిర్మిస్తున్న ఈ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌పీవోలకు 75 శాతం, వ్యక్తిగతంగా నిర్మించుకుంటే రైతులకు 40 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాము పండించిన ఉత్పత్తుల నాణ్యతను పెంచుకునేందుకు, మంచి ధరలు పొందడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు, కూరగాయల కోతలు, సరైన పద్ధతిలో రవాణా, గ్రేడింగ్, ప్యాకింగ్‌ చేయడంపై రైతులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు.  
 
సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.. 
సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు గుర్తింపు కోసం సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీలో ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, రైతులకు శిక్షణనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాన్ని మంత్రి అభినందించారు.

ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఉద్యాన పంటలు అధికంగా పండించే ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం చొప్పున 945 కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 505 కేంద్రాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా.. 171 చోట్ల పనులు చేపట్టామన్నారు. వీటిలో 32 కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు