బండ్లమ్మ తల్లికి బంగారు శోభ

1 May, 2021 08:16 IST|Sakshi

సాక్షి, పిట్టలవానిపాలెం (బాపట్ల): మండలంలోని చందోలులో ఉన్న బగళాముఖి బండ్లమ్మ అమ్మ వారి కొలుపులను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారి ముఖ మండప నిర్మాణం సమయంలో లభ్యమైన బంగారు ఆభరణాలను చందోలు ఎస్‌బీఐ శాఖ లాకరు నుంచి అధికారుల సమక్షంలో కనక తప్పెట్లు, బ్యాండు మేళాల నడుమ శాసన సభ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి దంపతులు ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

దేవ దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కోన రఘుపతి బండ్లమ్మకు భక్తుల సహకారంతో సిద్ధం చేసిన బంగారు కాసుల హారాన్ని అలంకరించారు. దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కమిషనర్‌ మహేశ్వరరెడ్డి, బాపట్ల ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఉయ్యూరి లీలాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ప్రజా ద్రోహులను వదిలిపెట్టం 
పొన్నూరు: ప్రజల సొమ్ము దోచుకున్న ద్రోహులను వదిలిపెట్టేది లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొన్నూరు వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఆయన శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా సమయంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సంగం డెయిరీలో అవినీతి చేశారని, అందుకే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఉమా, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల రక్తాన్ని తాగిన ఉమా, అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు బుద్ధి చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలో పాల డెయి రీలను నాశనం చేసిన ఘనత టీడీపీ నాయకులదేనని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు హెరిటేజ్‌ పాల డెయిరీ కోసం ఎన్నో ప్రభుత్వ డెయిరీలను నాశనం చేశారని మండిపడ్డారు.
చదవండి: 1,000 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు