స్థిరంగా వరద

19 Oct, 2020 04:06 IST|Sakshi
సాగర్‌లో 18 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

ప్రకాశం బ్యారేజీలోకి 6.15 లక్షల క్యూసెక్కుల రాక 

సముద్రంలోకి 6.12 లక్షల క్యూసెక్కులు విడుదల 

బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 

సాక్షి, అమరావతి/విజయపురి సౌత్‌ (మాచర్ల)/శ్రీశైలంప్రాజెక్ట్‌/అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 6,15,797 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 3,472 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 6,12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి 2 లక్షలు, ఉజ్జయిని నుంచి 1.50 లక్షలు, తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 

కరకట్ట లోపల తగ్గిన వరద 
గుంటూరు జిల్లా వైపు కరకట్ట లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కొల్లూరు, తాడేపల్లిలో కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీరు చేరిన ఇళ్లను గుర్తించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని ఆదేశించారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. కొల్లిపర మండలంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల పర్యటించారు.  

గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం
వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 26,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 24,520 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,73,089 క్యూసెక్కులు చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

శ్రీశైలంలోకి 5,12,690 క్యూసెక్కులు 
శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,12,690 క్యూసెక్కులు చేరుతోంది. పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి.. కుడి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 5,09,948 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.  

మరిన్ని వార్తలు