తూర్పు మధ్య బంగాళాఖాతంలో 23న అల్పపీడనం

19 May, 2021 05:46 IST|Sakshi
అల్పపీడనం ఊహా చిత్రం

ఆపై బలపడి తుపానుగా మారే అవకాశం

రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం

రుతుపవనాల ఆగమనానికి దోహదం  

సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం:  పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమబెంగాల్‌ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ నెల 25, 26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 23న అల్పపీడనం ఏర్పడినా, బలపడి తుపానుగా మారినా నైరుతి రుతువపనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.   

21న అండమాన్‌ సముద్రంలోకి ‘నైరుతి’.. 
మరోవైపు ఈనెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే అంటే.. ఈనెల 31న కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.  
 
పెరిగిన ఉష్ణోగ్రతలు 
కాగా, మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీనికితోడు ఉక్కబోత వాతావరణం నెలకొంది. రానున్న 3 రోజులు వాతావరణం మరింత వేడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయన్నారు. ఇదిలావుంటే.. వచ్చే 2 రోజుల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండుచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు