వరుడు లేకుండా చిన్నారులకు పెళ్లి

29 Mar, 2022 04:14 IST|Sakshi

చింతపల్లి (పాడేరు): ఆడ పిల్లలు పుడితే ఆ గిరిజనుల ఆనందానికి హద్దులు ఉండవు. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ముచ్చటగా మూడు సార్లు పెళ్లి కూడా చేస్తారు. ఆడపిల్లలకు పెళ్లికి ముందు బాల్యంలో ఒకసారి, యుక్తవయసు వచ్చాక మరోసారి పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు నిర్వహించడం వారి ఆచారం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మాలి జాతి గిరిజనుల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.

సోమవారం చింతపల్లి మండలంలోని చౌడుపల్లిలో 27 మంది ఐదేళ్లలోపు బాలికలకు వరుడు లేకుండా సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ సమీపంలో రాటలు వేసి, వాటికి కుండలను అమర్చి, పెళ్లి పందిరి నిర్మించారు. చిన్నారులకు కొత్త చీరలు కట్టి పెళ్లికూతురు వలె ముస్తాబు చేసి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసారు. అనంతరం భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్యంలో పెళ్లిళ్లు చేయడం మాలి తెగ గిరిజనులకు తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఏజెన్సీలో కూరగాయలు సాగు చేసేందుకు ఒడిశా నుంచి వలస వచ్చిన ఈ గిరిజనుల భిన్నమైన ఆచారం అందరినీ ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తలు