పెయిన్‌ 'కిల్లర్స్‌'.. 30 నుంచి 80 శాతం గర్భిణులు ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే..

19 May, 2022 05:36 IST|Sakshi

పుట్టబోయే బిడ్డపై ప్రభావం 

వైద్యులను సంప్రదించకుండానే మాత్రలు వాడుతున్న గర్భిణులు

పారాసిటమాల్, ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, నాప్రొక్సెన్‌లే అధికం

గడిచిన ఏడేళ్లలో 60 శాతం పెరిగిన వినియోగం

నెలలు నిండకుండా 50 శాతం ప్రసవాలు, 28 శాతం బరువు తక్కువగా జననం

యూకేకు చెందిన అబెర్డీన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో.. వైద్యులను సంప్రదించకుండా మహిళలు వాడుతున్న పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు.. పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశాన్ని యూకేకు చెందిన  అబెర్డీన్‌ విశ్వవిద్యాలయం ఓ నివేదికలో ధ్రువీకరించింది. 1985 నుంచి 2015 మధ్య 1.51 లక్షల మందికి పైగా గర్భిణులపై జరిగిన అధ్యయనం ఆధారంగా పలు అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 80 శాతం మంది మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో వైద్యులను సంప్రదించకుండా ప్రిస్క్రిప్షన్‌ లేకుండా పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు వినియోగిస్తున్నట్లుస్పష్టం అయ్యింది.

శిశువుపై తీవ్ర ప్రభావం
గర్భవతులు పారాసిటమాల్, డైక్లోఫెనాక్,  ఆస్పిరిన్, నాప్రోక్సెన్, ఇబుప్రోఫెన్‌ వంటి ఐదు రకాల మందులను వైద్యులను సంప్రదించకుండా ఎక్కువగా వినియోగిస్తున్నారు. 30 ఏళ్ల అధ్యయన కాలంలో గత ఏడేళ్లలో ఈ మాత్రల వినియోగం 60 శాతం మేర పెరిగింది. తొలి యాంటినేటల్‌ చెకప్‌కు వచ్చిన మహిళలను ప్రత్యేకంగా ఆరా తీయగా ప్రతి ఐదుగురిలో నలుగురు గర్భిణులు 12 వారాల్లోపు పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు వినియోగించినట్లు తెలిసింది.

మూడు నెలల్లోపు వాడకూడదు..
ఆస్పిరిన్, ఇబుప్రొఫెన్‌ సహా పలు పెయిన్‌ కిల్లర్‌ మందులు నాన్‌–స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ రకానికి చెందినవి. వీటిని గర్భం దాల్చిన సమయంలో వినియోగించడం శ్రేయస్కరం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారాసిటమాల్‌ వాడితే పర్వాలేదు. ఇక మిగిలిన పెయిన్‌ కిల్లర్స్‌ వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
–  ప్రొఫెసర్‌ డాక్టర్‌ హిమబిందు, గైనకాలజీ, విజయవాడ జీజీహెచ్‌ 

మరిన్ని వార్తలు