మేకపాటి ఆత్మీయ పరిచయం 

7 May, 2022 20:39 IST|Sakshi

నేటి నుంచి  14 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన 

వైఎస్సార్‌సీపీ నేతలను పరిచయం చేసుకోనున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి   

తండ్రి అపార అనుభవం, సోదరుడి వారసత్వంతో ముందడుగు 

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి శనివారం నుంచి ఆత్మీయ పరిచయ కార్యక్రమం చేపట్టనున్నారు.  14 రోజుల పాటు నియోజకవర్గంలో మండలాల వారీగా విస్తృతంగా పర్యటించి ప్రజలతో పాటు పార్టీ నేతలతో మమేకం కానున్నారు. తొలుత మేకపాటి సొంత మండలం మర్రిపాడు నుంచే ఈ పరిచయ కార్యక్రమం కొనసాగించనున్నారు. శనివారం సాయంత్రం మర్రిపాడు మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు, మేకపాటి అభిమానులను ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దగ్గరుండీ పరిచయం చేయనున్నారు.

ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీ, సోమవారం అనంతసాగరం మండలం, మంగళవారం ఆత్మకూరు రూరల్‌ మండలాల్లో స్థానిక నాయకులు పరిచయం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఏఎస్‌పేట, సంగం, చేజర్ల మండలాల్లో పరిచయ కార్యక్రమంతో పాటు గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపట్టనున్నారు. 14 రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేసి ప్రజలతో మమేకం కానున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఈ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు తెలిపారు.  

గౌతమ్‌రెడ్డి వారసుడిగా.. 
ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా సోద రుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి తెరపైకి వస్తున్నారు. బీటెక్‌ సివిల్‌ ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, స్పెషలైజ్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఎంస్‌ను ఆస్ట్రేలియాలో పూర్తి చేసిన విక్రమ్‌రెడ్డి కేఎంసీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సోదరుడు గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు.

మేకపాటి కుటుంబానికి ఆత్మకూరు నియోజకవర్గంలో అపారమైన ఆదరణ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యేందుకు విక్రమ్‌రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందస్తుగా పరిచయ కార్యక్రమం చేపట్టుతున్నట్లు వైఎస్సార్‌సీపీ శ్రేణులు వివరిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు