Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..

19 Jul, 2022 08:16 IST|Sakshi

నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్‌గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత  ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు.

విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్‌లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్‌బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు.  సహకార శాఖ రిజిస్ట్రార్‌ (ఆర్‌సీఎస్‌) అహ్మద్‌బాబు, ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి, ఎస్‌బీఐ జీఏం ఓం.నారాయణ్‌ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్‌ గోపాల్‌ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్‌ఎస్‌ మూర్తి, ఆప్కాబ్‌ ఎండీ ఎంఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి

మరిన్ని వార్తలు