సాంకేతికతలో ఏపీ అగ్రస్థానమే లక్ష్యం: గౌతమ్‌రెడ్డి

30 Jul, 2020 12:51 IST|Sakshi

చిన్న సంస్కరణలతోనే ఊహించని అభివృద్ధి

సాక్షి, అమరావతి: టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ ‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెజాన్ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నైపుణ్యం, స్టార్ట్ అప్, మెషిన్ లెర్నింగ్, డేటా సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెన్సార్ ఆధారిత టెక్నాలజీలలో అమెజాన్ భాగస్వామ్యం, అవకాశాలపై చర్చ జరిగింది. (పారిశ్రామిక చేయూతలో ఏపీనే బెస్ట్‌) 

ఈ వర్చువల్ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి భాను ప్రకాశ్,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, రాహుల్ శర్మ, స్టేట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ విభాగాధిపతి అజయ్ కౌల్,  పబ్లిక్ పాలసీ హెడ్, లొబొ, సొల్యుషన్స్ ఆర్కిటెక్చర్ విభాగం, కాకరపర్తి దుర్గాప్రసాద్ హాజరయ్యారు.(ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా)

ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వప్నమని పేర్కొన్నారు. హస్తకళలు, బొమ్మల తయారీ, వివిధ ఉత్పత్తులను తయారు చేసే మహిళలను ప్రోత్సహిస్తామన్నారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

పరిపాలన, వినూత్న ఆలోచనల అమలుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో ఐటీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు. టెక్నాలజీతో సంక్షేమం, పథకాలను ప్రజల ఇళ్లకు చేరుస్తామన్నారు. వినూత్న ఆలోచనలు, కొత్త టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పెద్దపీట వేస్తామన్నారు. చిన్న సంస్కరణలతోనే ఊహించని అభివృద్ధికి అవకాశం ఉందని ఐఎస్ బీ, అమెజాన్ ల భాగస్వామ్యంతో ప్రజల ప్రాథమిక హక్కులను మరింతగా నెరవేరుస్తామని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు