‘గెజిట్ నోటిఫికేషన్‌తో కేఆర్‌ఎంబీ సమర్థవంతంగా పనిచేసే అవకాశం’

9 Aug, 2021 18:06 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్‌ఎంబీకి ఇండెంట్‌ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గత జూలై 5న జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు.

శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్‌ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్‌ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్‌ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్‌ డామ్‌, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్‌ఎంబీ తెలంగాణ జెన్‌కో అధికారులను ఆదేశించిందని చెప్పారు.

జల విద్యుత్‌ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్‌ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్‌ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్‌కో (హైడల్‌) డైరెక్టర్‌ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్‌ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్‌ఎంబీకి తెలిపారని స్పష్టం చేశారు. 

విద్యుత్‌ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌, నాగార్జున సాగర్‌ డామ్‌, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్‌ఎంబీ జూలై 16న రాసిన లేఖలో  తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్‌ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేఆర్‌ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు