అమ్మ కావాలి!

24 May, 2022 10:35 IST|Sakshi

సాక్షి అనంతపురం: దైవ సమానురాలు అమ్మ.. అలాంటి మాతృమూర్తి పొత్తిళ్లలో ఒదిగిపోవాలని, ఆమె చేత గోరుముద్దలు తినాలని ఏ బిడ్డకు మాత్రం ఉండదు? ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ.. కన్నతల్లి తన బిడ్డను వదిలివెళ్లిపోయింది. కనీసం తను ఎలా ఉంటుందో తెలియనీకుండా జ్ఞాపకాలనూ వెంట తీసుకెళ్లిపోయింది. 27 ఏళ్లుగా తాత, అవ్వ నీడనే పెరిగి పెద్దవాడైన ఆ కుమారుడికి కొన్ని రోజుల క్రితమే తమ బంధువుల ఇంట్లోని ఓ ఫొటోలో తల్లి కనిపించింది. ఇంకేముంది తన మాతృమూర్తి ఇలా ఉంటుందా అని తెలుసుకున్న ఆ కుమారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న రామిరెడ్డిగారి మోహన్‌రెడ్డిదీ కథంతా. అనంతపురం మండలం ఆకుతోటపల్లికి చెందిన ఈయన పుట్టిన మూడు నెలలకే తండ్రి ఆర్‌.లక్ష్మినారాయణరెడ్డి మరణించారు. ఏడాది వరకు అల్లారుముద్దుగా పెంచిన అమ్మ మణి ఎక్కడికో వెళ్లిపోయారు. అప్పటి నుంచి తాత లక్ష్మిరెడ్డి, నానమ్మ సుబ్బమ్మే మోహన్‌రెడ్డిని పెంచి పోషించారు. ఇటీవల బంధువుల ఇంటికి వెళ్లిన అతనికి అప్పట్లో జరిగిన ఓ పెళ్లిలో తీసిన ఫొటోలో అమ్మ మణి కనిపించింది. ఆ ఫొటో ఆధారంగా మణి జాడ తెలుసుకునేందుకు మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కనిపించిన వాళ్లందరికీ ఫొటో చూపిస్తూ అమ్మ కోసం ఆరా తీస్తున్నారు. అలా ‘సాక్షి’తో సోమవారం తన గోడు చెప్పుకున్నారు.    

(చదవండి: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ)

మరిన్ని వార్తలు