Zomato: మూడు రెట్లు పెరిగిన నష్టాలు,షేర్లు జంప్‌, టార్గెట్‌ ఎంతంటే?

24 May, 2022 10:30 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు  వరుస  నష్టాల షాక్‌ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో నికర నష్టం భారీగా మూడురెట్లు పెరిగి రూ. 360 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020-21) ఇదే కాలంలో రూ. 134 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 692 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు జంప్‌ చేసింది.

అయితే మొత్తం వ్యయాలు రూ. 885 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ. 1,225 కోట్లను దాటింది. 202021లో రూ. 816 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,994 కోట్ల నుంచి రూ. 4,192 కోట్లకు ఎగసింది. కంపెనీ తిరిగి వృద్ధి బాట పట్టినట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ ఫలితాల విడుదల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ తదుపరి సవాళ్లు బిజినెస్‌ వృద్ధిపై ఎలాంటి ప్రతికూలతలూ చూపించబోవని అంచనా వేశారు. వృద్ధిని కొనసాగించడం, నష్టాలను తగ్గించుకోవడం తదితర దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. 

ఫలితాల నేపథ్యంలో  సోమవారం జొమాటో షేరు 2.2 శాతం క్షీణించి రూ. 57 వద్ద ముగిసింది. అయితే మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే ఏకంగా 17 శాతం ఎగిసింది.  ప్రస్తుతం 8శాతం లాభాలతో కొనసాగుతోంది. ట్రేడ్‌పండితులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించడంతో   పేర్కొనడంతో  కొనుగోళ్ల జోరు నెలకొంది.

మరిన్ని వార్తలు