మహానది టు కావేరి వయా గోదావరి! 

10 Oct, 2022 08:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ద్వారా 477 టీఎంసీలను వినియోగించుకోవచ్చని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ  కేంద్రానికి ప్రతిపాదించింది. మహానది నుంచి 230, గోదావరి నుంచి 247 టీఎంసీలను తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేయొచ్చంది.  అనుసంధానంపై ఏకాభిప్రాయానికి ఆ నదుల పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ నిర్ణయించింది.  

మహానది – గోదావరి అనుసంధానం ఇలా.. 
ఒడిశాలో బర్మూర్‌ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలిస్తారు. 

గోదావరి–కావేరి అనుసంధానం ఇలా.. 
జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట)కి తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్‌డబ్ల్యూడీఏ గతేడాది ఏప్రిల్‌లో డీపీఆర్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఆ నదుల పరిధిలోని రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఈ 247 టీఎంసీల గోదావరి జలాలకు మహానది నుంచి గోదావరిలోకి వచ్చిన 230 టీఎంసీలను జతచేసి.. మొత్తం 477 టీఎంసీలను మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానం ద్వారా తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది.  

మరిన్ని వార్తలు